తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈ కేసులో త్వరలోనే తుది అదనపు ఛార్జిషీట్‌ను న్యాయస్థానంలో దాఖలు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఛార్జిషీట్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన నిందితుడిగా, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను రెండో నిందితుడిగా పేర్కొనడానికి సిట్ అధికారులు రంగం సిద్దం చేసారు.
Also Read : దిల్ రాజు పై పెయిడ్ ట్రోల్స్ నడిపిందెవరు?
వీరితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావుల పేర్లను కూడా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చట్టవిరుద్ధంగా నిఘా కార్యకలాపాలు కొనసాగించడానికి నాటి సీఎం కేసీఆర్ ప్రధాన సూత్రధారి అని సిట్ తన నివేదికలో పొందుపరచనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో తమకు అనుకూలమైన అధికారులకు ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించి, వారి ద్వారా వ్యవస్థీకృత కుట్రకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించారు.
ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీల ఫోన్లను నిబంధనలకు విరుద్ధంగా ట్యాప్ చేశారని సిట్ నిర్ధారణకు వచ్చింది. ఈ అక్రమ ట్యాపింగ్‌కు అనుమతులు ఇచ్చిన ఉన్నతాధికారుల పేర్లు, వారి పాత్రను కూడా సాక్ష్యాధారాలతో సహా తుది ఛార్జిషీట్‌లో వివరంగా పేర్కొనబోతున్నారు. ఇప్పటికే ఈ దర్యాప్తు పురోగతిపై సిట్ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో బ్రీఫింగ్ ఇచ్చినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. న్యాయపరంగా ఎలాంటి లోపాలు లేకుండా పటిష్ఠమైన ఛార్జిషీట్ రూపొందించేందుకు..
Also Read : గిరిబాబు చివరి కోరిక నెరవేరింది.. రావినూతలలో కన్నీటి వీడ్కోలు
సిట్ అధికారులు రాష్ట్ర సీనియర్ న్యాయవాదులతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల సలహాలను కూడా తీసుకున్నారు. ఈ నివేదికలో అత్యంత కీలకమైన ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలతో పాటు, ఫోన్ ట్యాపింగ్ బాధితులైన సుమారు వంద మంది వాంగ్మూలాలను జతచేస్తున్నారు. ముఖ్యంగా, ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడి, తమ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు రాయించుకున్నారన్న ఆరోపణలపై ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో అత్యంత కీలక మలుపుగా మారనుంది.


