ఒక్క మేయర్ కుర్చీ.. మూడు పార్టీల నేతలకు ప్రతిష్ఠాత్మకం. ఇంకా చెప్పాలంటే.. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అధినేతలు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న నాలుగు మునిసిపల్ కార్పొరేషన్లు, 19 మునిసిపాలిటీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆ కార్పొరేషన్ మేయర్ స్థానంపైనే ఉంది. అక్కడ ఎవరు గెలుస్తారు.. ఎంత మెజారిటీ సాధిస్తారు.. అనే చర్చ పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. మేయర్ అభ్యర్థిగా ఒక సాధారణ మహిళపై ఓ మాజీ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. అలాగే.. వైసీపీ తరఫున మాజీ మంత్రి చక్రం తిప్పుతున్నారు. కూటమి తరఫున కేంద్ర, రాష్ట్ర మంత్రులు రంగంలోకి దిగారు. అందుకే ఇప్పుడు మేయర్ ఎన్నిక అందరికీ కీలకం.
Also Read : సాక్షి ఛానల్ కు షాక్ ఇచ్చిన అమరావతి రైతు..!
శ్రీకాకుళం మేయర్ ఎన్నిక ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు ప్రధాన కారణం.. వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సుమారు 40 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన గుండ కుటుంబం.. ఇటీవలే వైసీపీలో చేరింది. లక్ష్మీదేవి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. గుండ అప్పల సూర్యనారాయణ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. అయితే 2024 ఎన్నికల్లో గుండ లక్ష్మిదేవిని పక్కన పెట్టిన టీడీపీ అధిష్ఠానం.. గోండు శంకర్‌కు అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి గుండ కుటుంబం పార్టీ పెద్దల పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ముఖ్యంగా కింజరాపు కుటుంబమే తమకు టికెట్ రాకుండా చేసిందని గుండ కుటుంబం ఆరోపిస్తోంది. అందుకే సిక్కోలు మేయర్ కుర్చీ గెలిచి.. కింజరాపు కుటుంబంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయాన్ని చూపిస్తామని గట్టి పట్టుదలతో గుండ కుటుంబం ఇప్పటికే పని చేస్తోంది.
శ్రీకాకుళం మేయర్ కుర్చీ గెలుపు వైసీపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావుకు అత్యంత కీలకం. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న గుండ కుటుంబాన్ని ఒప్పించిన ధర్మాన.. మేయర్‌గా గెలిపించే బాధ్యతను కూడా తీసుకున్నారు. జిల్లాలో కింజరాపు కుటుంబ ఆధిపత్యానికి బ్రేకులు వేసేందుకు, పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే బాధ్యతను కూడా ధర్మాన పైనే ఉంచారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే.. శ్రీకాకుళం మేయర్‌గా గుండ లక్ష్మీదేవి గెలవాలని టార్గెట్ పెట్టారు. దీంతో తన మార్కు రాజకీయం చేస్తున్న ధర్మాన.. చివరికి పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్‌గా కూర్చొనేందుకు కూడా రెడీ అంటున్నారు. ఎవరొస్తారో రండి.. ఏం చేస్తారో నేనూ చూస్తా.. అంటూ సవాల్ విసురుతున్నారు కూడా.
మరోవైపు శ్రీకాకుళం మేయర్ ఎన్నికలు కూటమి పార్టీలకు రెఫరెండంగా మారాయి. నిజానికి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీకి అనుకూలం కాదు. అలాంటి మేయర్ సీటును జనసేనకు కేటాయించారు. అయితే శ్రీకాకుళం మేయర్ కుర్చీ టీడీపీకి కేటాయించాలని చివరి నిమిషం వరకు కింజరాపు బాబాయ్, అబ్బాయిలు తీవ్రంగా ప్రయత్నం చేసినా.. పెద్దగా ఫలితం రాలేదు. టీడీపీ నుంచి ఆశావహుల జాబితా భారీగా ఉండటంతో.. వారిలో ఒకరిని ఎంపిక చేసి జనసేనలోకి పంపి.. టికెట్ వచ్చేలా చేద్దామనే ప్రయత్నం కూడా చేశారు. కానీ.. చివరికి జనసేన పార్టీ నేత డాక్టర్ దానేటి శ్రీధర్ సతీమణి డాక్టర్ రాధారాణికి మేయర్‌గా అవకాశం ఇచ్చారు. ఇక్కడ జనసేన అభ్యర్థి గెలుపు బాధ్యతను కింజరాపు కుటుంబానికి అప్పగించారు కూడా. ఇప్పటికే గుండ కుటుంబం ఆరోపణలు, ధర్మాన రాజకీయంతో పాటు సొంత పార్టీలోనే వ్యతిరేకత కూడా కింజరాపు అచ్చెన్నాయుడుకు తలనొప్పిగా మారాయి. మరోవైపు శ్రీకాకుళం మేయర్ సీటు కూటమి అభ్యర్థి రాధారాణి ఓడితే మాత్రం.. అది పూర్తిగా కింజరాపు బాబాయ్, అబ్బాయ్ వైఫల్యం అనే అపవాదు తప్పదు.
Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన మలుపు..!
అందుకే శ్రీకాకుళం మేయర్ ఎన్నిక.. రాజకీయాల్లో సీనియర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మాన ప్రసాదరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, గుండ లక్ష్మీదేవిలకు అగ్ని పరీక్ష అనే మాట బాగా వినిపిస్తోంది. ఇది జనసేన – వైసీపీ అభ్యర్థుల మధ్య పోటీగా చూడటం కంటే.. కింజరాపు వర్సెస్ ధర్మాన, గుండ అన్నట్లుగా మారిందనే మాట బాగా వినిపిస్తోంది. మరి గెలుపు ఎవరిదో.. ఓటర్లు సానుభూతికి పడిపోతారా.. లేక కొత్త వ్యక్తిని ఎన్నుకుంటారా.. అనే విషయం తెలియాలంటే.. ఫలితాల వరకు ఆగాల్సిందే.


