ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి ‘కుడిభుజం’గా, పార్టీ ఆర్థిక-రాజకీయ వ్యూహాల్లో కీలక సూత్రధారిగా వ్యవహరించిన విజయవాడ పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఇప్పుడు ఏకంగా చంద్రబాబు, లోకేష్‌లకే సవాల్‌గా మారారు. పైకి కూటమి ధర్మాన్ని నటిస్తూనే, తెర వెనుక తెలుగుదేశం పార్టీ పునాదులను కదిలించేలా, అధిష్టానాన్ని ఇరకాటంలో పెట్టేలా తీవ్రస్థాయి రాజకీయం నడుపుతున్నారన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : సీఎం చంద్రబాబు భద్రతా ఘటనతో కేంద్రం సంచలన నిర్ణయం..!
2019లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత బీజేపీలోకి జంప్ చేసినప్పటికీ సుజనా చౌదరి ఎన్నడూ చంద్రబాబును నేరుగా విమర్శించలేదు. 2024 ఎన్నికల పొత్తులోనూ కీలక పాత్ర పోషించారు. అయితే కూటమి అధికారంలోకి రాగానే సీన్ పూర్తిగా మారిపోయింది. సుజనా చౌదరి ఆశించిన మంత్రి పదవి దక్కకపోవడమే ఈ తీవ్ర అసంతృప్తికి మూలకారణమని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సుజనా చౌదరికి మంత్రి పదవి దక్కకుండా అడ్డుకున్నది నారా లోకేష్ మాత్రమేనని ఆయన సన్నిహిత వర్గాలు బహిరంగంగానే ప్రచారం చేస్తున్నాయి. నాటి నుంచి సుజనా అసలు గురి నారా లోకేష్ పైకి మళ్లింది.
టీడీపీలోని సీనియర్ నాయకులను పక్కనపెట్టి నారా లోకేష్ తన సొంత వర్గాన్ని, టీమ్ ను నిర్మించుకోవడంపై పార్టీలో లోలోపల పెల్లుబుకుతున్న అసంతృప్తికి ఇప్పుడు సుజనా చౌదరి ‘ప్రధాన కేంద్రం’గా మారారు. బెజవాడ రాజకీయాన్ని వేదికగా చేసుకుని లోకేష్ వ్యతిరేక వర్గానికి సుజనా తెర వెనుక నుంచి ఊపిరి పోస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు తరహాలో గళమెత్తి అధిష్టానాన్ని ఆత్మరక్షణలో పడేసిన వ్యవహారం వెనుక సుజనా చౌదరి రాజకీయ అభయహస్తం ఉందని తెలుస్తోంది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును స్వతంత్ర అభ్యర్థిగా మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపడం వెనుక సుజనా చౌదరి నేరుగా కనిపించకపోయినా, వారిద్దరి మధ్య ఉన్న అవగాహనతోనే జరిగిందనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. లోకేష్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఏబీవీని సుజనా పరోక్షంగా ప్రోత్సహించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో టీడీపీ కేడర్ గట్టిగా నిలబడటంతో ఏబీవీకి ఆశించిన ఫలితం దక్కలేదు.
Also Read : ఎవరి బీ టీమ్ కాదు.. హామీ ఇస్తున్నా..!
అంతేకాకుండా, ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఒక భారీ ప్రాజెక్టు విషయంలో సుజనా ట్వీట్ చేస్తూ మొత్తం క్రెడిట్ ప్రధాని మోదీకి, కేంద్రానికే కట్టబెట్టి చంద్రబాబు, లోకేష్‌ల పేర్లను కనీసం ప్రస్తావించకపోవడం ఆయన మనసులోని తీవ్ర అసంతృప్తిని స్పష్టం చేసింది. ఒకప్పుడు సొంత నీడలా నిలిచిన సుజనా ఇప్పుడు సొంత కూటమికి, అధిష్టానానికి ‘పక్కలో బల్లెం’గా మారి వెన్నుపోటు రాజకీయం నడుపుతుంటే చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడ్డారా? అనే మాట బాగా వినిపిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే ముసుగులో ఉండటంతో సుజనాపై నేరుగా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం కూడా టీడీపీకి లేదు. సీనియర్లను ఏకం చేస్తూ లోకేష్ భవిష్యత్తుకు గండికొట్టేలా సుజనా చౌదరి ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో అధిష్టానం వేసే తదుపరి ఎత్తుగడ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


