తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా “రా ఎన్టీఆర్” అనే సేవా సంస్థ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వంద కోట్ల రూపాయల బడ్జెట్తో గ్రామగ్రామాన భారీ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఈ సంస్థ తిరుపతిలో ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ, సినీ వర్గాల్లో కలకలం రేగింది. అయితే, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరు, ఫోటోలను వాడుకుంటూ ఈ సంస్థ విపరీతమైన హడావుడి చేయడంతో దీని వెనుక ఏవైనా రాజకీయ వ్యూహాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Also Read : దిగి వచ్చిన మోడీ.. కీలక ప్రకటన..
ఈ వివాదంపై జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం వెంటనే స్పందిస్తూ ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. “రా ఎన్టీఆర్ అనే సంస్థతో కానీ, వారి సేవా కార్యక్రమాలతో కానీ హీరో ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదా భాగస్వామ్యం లేదు. ఎన్టీఆర్ పేరుతో ఎలాంటి ప్రచారాలు చేయడానికి ఆ సంస్థకు ఎటువంటి హక్కులు లేవు” అని తారక్ పీఆర్ టీమ్ స్పష్టం చేసింది. హీరో ఎన్టీఆర్ స్వయంగా ఈ సంస్థను దూరం పెట్టడంతో పాటు, అటు అభిమాన సంఘాల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో.. నిర్వాహకులు వెనక్కి తగ్గి ఈ సంస్థ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య కంచె వార్..!
మరోవైపు ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి అవమానించినప్పుడు కనీసం నోరు మెదపని ఈ సంస్థ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంద కోట్లతో సేవ అంటూ రావడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ అభిమానులను తప్పుదోవ పట్టించడానికే ఈ డ్రామాలు ఆడుతున్నారని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సేవలు ఎందుకు చేయలేదని టీడీపీ శ్రేణులు సూటిగా ప్రశ్నిస్తున్నాయి.

