తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి భూ తగాదాలకు తావు లేదని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు, నాయకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భూ వివాదాల్లో టీడీపీ నేతలు వేలు పెట్టవద్దని.. ఏదైనా ల్యాండ్ గొడవలు ఉంటే.. వాటిని న్యాయపరంగా పరిష్కరించుకోవాలని కూడా సూచించారు. అయితే అధినేత ఆదేశాలను చాలా మంది నేతలు ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. చాలా చోట్ల భూ తగాదాలు, వివాదాల్లో టీడీపీ నేతల ప్రమేయం ప్రత్యక్షంగా ఉంది. అయితే తాజాగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వివాదం చెలరేగటం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : రాజీ కోసం జగన్ ప్రయత్నాలు..!
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త రామచంద్రరావు తొలి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో చాలా చోట్ల వెంచర్‌లు వేశారు. అయితే కొన్ని చోట్ల సొంత పార్టీ నేతలో రామచంద్రరావుపై బహిరంగ విమర్శలు చేశారు. తాజాగా మార్కాపురం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిపై రామచంద్రరావు తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. నిన్నటి వరకు కలిసి వ్యాపారాలు చేసిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఇలా పరస్పరం ఆరోపణలు చేయడం ఏమిటనే విషయం పార్టీ పెద్దలకు కూడా అర్థం కావటం లేదు.
మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. భూముల ధరలకు రెక్కలు రావడంతో.. రియల్ ఎస్టేట్ వెంచర్లు భారీగా మొదలయ్యాయి. ఇందులో భాగంగానే భ్రమర రియల్ ఎస్టేట్ వెంచర్ కూడా మార్కాపురంలో మొదలుపెట్టారు రామచంద్రరావు. మార్కాపురం పట్టణ శివారు ప్రాంతమైన పూలసుబ్బయ్య కాలనీ పరిధిలో ఏకంగా 167 ఎకరాల్లో భ్రమర వెంచర్ వేశారు. ఇక్కడ గజం రూ.14 వేలుగా విక్రయిస్తున్నారు. అయితే ఈ వెంచర్ ప్రారంభంలోనే చెరువు ఆక్రమించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టి చెరువు కాదని తేల్చేశారు.
ఇక్కడే అసలు కథ మొదలైంది. అధికారుల నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత భ్రమర వెంచర్ మరో అడుగు ముందుకు వేసింది. తమ వెంచర్‌కు వెళ్లేందుకు ఓ రహదారి నిర్మించింది. ఇప్పుడు గొడవంతా ఆ దారి వల్లే వచ్చింది. దారి నిర్మించుకున్న భ్రమర వెంచర్స్ యాజమాన్యం.. రహదారికి ఇరు వైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంది. దీని వల్ల ఆ రహదారికి అటూ ఇటూ వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. నిజానికి భ్రమరా వెంచర్ కాస్త లోపలికి ఉంటుంది. అందుకే చెరువు మధ్యలో రోడ్ వేసుకున్నారు. ఇక్కడే టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అనుచరుడు సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. భ్రమర వెంచర్స్ ముందు భాగంలో ఉన్న 8 ఎకరాల్లో మరో వెంచర్ వేశారు. అక్కడ ధరను గజం రూ.10 వేలు మాత్రమే అని ప్రకటించారు. ఆ 8 ఎకరాల్లో మట్టి పనులు చేస్తున్న సుబ్బారెడ్డి వర్గీయులు.. రహదారి లేకుండా చేశారంటూ భ్రమర వెంచర్స్ వేసిన కంచెను తొలగించారు.
Also Read : చిరంజీవికి విలన్ గా బెస్ట్ ఫ్రెండ్..!
తమ వెంచర్ ముందు భాగంలో చెరువు భూమి 8 ఎకరాలు ఆక్రమించడమే కాకుండా.. తమ కంటే తక్కువ ధరకే ప్లాట్లు విక్రయించడంపై భ్రమర యాజమాన్యం ఫైర్ అవుతోంది. చెరువు ఆక్రమించారని.. నారాయణ రెడ్డి వర్గం వేసిన వెంచర్‌కు అనుమతులే లేవని.. తమ ఫెన్సింగ్ తొలగించి దౌర్జన్యం చేశారని కేసులు పెట్టారు. దీంతో ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది. ఎమ్మెల్యే కందులకు జిల్లా అధికారులు సహకరిస్తున్నారని భ్రమర సంస్థ యాజమాన్యం తరఫున రామచంద్రరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ వ్యాపారానికి కందుల అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. చెరువు ఆక్రమించుకోవటం తప్పు అయితే.. ఆ చెరువులో వేసిన రోడ్డు కోసం ఇరు వర్గాలు తన్నుకోవటం ఏమిటనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. మరి ఈ పంచాయతీకి పార్టీ పెద్దలు ఎలా బ్రేకులు వేస్తారో చూడాలి.

