ఉమ్మడి గుంటూరు జిల్లాను విభజించి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలుగా మార్చేసింది గత వైసీపీ ప్రభుత్వం. పరిపాలన సౌలభ్యం పేరుతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. నిజానికి ఉమ్మడి గుంటూరు జిల్లాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు. 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంట్ స్థానాలున్న జిల్లా. ఎంతో మంది రాజకీయ ఉద్ధండులు చక్రం తిప్పిన జిల్లా. అలాంటి జిల్లా మూడు ముక్కలైన తర్వాత ఇప్పుడు తన ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడింది.
ప్రస్తుతం పల్నాడు జిల్లాకు ఇస్తున్న ప్రాధాన్యత, గుంటూరు జిల్లాకు ఇవ్వటం లేదు. చివరకు గుంటూరులో ఉండే మిర్చి యార్డు చైర్మన్ పదవి కూడా పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడికే దక్కింది. అదే విధంగా డీసీసీబీ చైర్మన్ పదవిని కూడా పల్నాడు జిల్లా పరిధిలోని వినుకొండ మాజీ ఎమ్మెల్యేకే దక్కింది. అసెంబ్లీ చీఫ్ విప్ పదవి కూడా ప్రస్తుతం వినుకొండ ఎమ్మెల్యే గారినే వరించింది. పదవులన్నీ పల్నాడు జిల్లాకే ఇవ్వటం వెనుక.. టీడీపీలో పై స్థాయి నేత చక్రం తిప్పుతున్నారనే మాట బాగా వినిపిస్తోంది.
Also Read : గురు శిష్యుల మధ్య జల రగడ.. చంద్రబాబు స్పందిస్తారా..?
పల్నాడుకు ఇస్తున్న ప్రాధాన్యత.. గుంటూరు జిల్లాకు ఇవ్వటం లేదని టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి గుంటూరు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మిర్చి ఘాటు. ఆ తర్వాత పల్నాటి పౌరుషం. గుంటూరు జిల్లా అనగానే ఠక్కున చెప్పే పేర్ల జాబితాలో టాప్ 5లో నాలుగు పల్నాడు జిల్లాకు చెందినవే. గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, మాచర్ల, సత్తెనపల్లి… ఆ తర్వాతే తెనాలి, బాపట్ల అనే పేర్లు వస్తాయి. అందుకే గుంటూరు, బాపట్ల జిల్లాల కంటే కూడా పల్నాడు జిల్లాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది.
పల్నాడు జిల్లా నేతలు ఉమ్మడి జిల్లా కీలక పదవులను కూటమి ప్రభుత్వం ఇస్తోంది. అదే సమయంలో గుంటూరు జిల్లాకు మాత్రం అన్యాయం చేస్తోందనే మాట బాగా వినిపిస్తోంది. చివరకు గుంటూరు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పోస్టులను కూడా తెలుగేతర ఐఏఎస్ అధికారులను నియమించారు. ఇక మంత్రి పదవి కేటాయింపులో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికైన లోకేష్‌తో పాటు తెనాలి నుంచి ఎన్నికైన నాదెండ్ల మనోహర్‌కు పదవులు దక్కాయి. మిగిలిన సీనియర్‌లకు అమాత్య పదవి రాలేదు.
Also Read : వైయస్ భారతి పొలిటికల్ ఎంట్రీ ఫైనల్..? కీలక బాధ్యతల్లో మేడం..?
గుంటూరు జిల్లా టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేల తీరుపై అటు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కాస్త ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న వారిలో ఎక్కువ మంది వైసీపీ నేతలతో తెర వెనుక సంబంధాలు నడుపుతున్నారనే రిపోర్టు కూడా అధినేతకు చేరినట్లు సమాచారం. ఇప్పుడు ఇదే మాట పార్టీలో కూడా బాగా వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో నాటి ప్రజాప్రతినిధులు చేసిన అవినీతి, అక్రమాలపై ప్రస్తుతం టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు కనీనం నోరు ఎత్తడం లేదు. నాటి అవినీతి బయటపెట్టకుండా, మౌనం వహిస్తున్నారు.
అప్పట్లో వైసీపీ నేతల, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై పోరాడిన నేతలు.. ఇప్పుడు మాత్రం నోరెత్తడం లేదు. నిజానికి చీప్ విప్ పదవి ఆరు సార్లు గెలిచిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు వస్తుందని అంతా ఊహించారు. కానీ అది కాస్తా పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు దక్కింది. ఇక జిల్లా అధ్యక్ష పదవి అయిన వస్తుందని భావించారు. కానీ.. అదీ దక్కలేదు. దీంతో కీలక పదవులు గుంటూరు జిల్లా నేతలకు రాకుండా.. పల్నాడు జిల్లాకు దక్కడం వెనుక అదృశ్య శక్తి ఎవరనే చర్చ ఇప్పుడు టీడీపీలో జోరుగా నడుస్తోంది.
Also Read : జగన్ కొత్త టార్గెట్.. ఆరు నెలలకు రూట్ మ్యాప్ రెడీ..?
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని 3 జిల్లాలకు 3 మంత్రి పదవులు, ఒక చీఫ్ విప్ పదవి దక్కింది. ఇందులో గుంటూరు జిల్లా పరిధిలోని మంగళగిరి, తెనాలికి రెండు మంత్రి పదవులు, బాపట్ల జిల్లా రేపల్లెకు మరో మంత్రి పదవి దక్కింది. అలాగే పల్నాడు జిల్లా వినుకొండకు చీఫ్ విప్ పదవి వచ్చింది. మూడు జిల్లాలకు న్యాయం జరిగినప్పటికీ.. కొంతమంది సీనియర్లకు మాత్రం పదవి రాలేదనే అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. దూళిపాళ్ల నరేంద్రకుమార్, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీ నారాయణ, యరపతినేని శ్రీనివాసరావు వంటి సీనియర్లతో పాటు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కూడా ఇప్పుడు పదవి కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే చంద్రబాబు, లోకేష్ దృష్టి మాత్రం వీరిపై లేనట్లు తెలుస్తోంది. వీరిలో ప్రత్తిపాటి, దూళిపాళ్ల, కన్నా లకు ఇవే ఆఖరి ఎన్నికలు. భవిష్యత్తులో వీరి వారసులు పోటీ చేసే అవకాశం ఉంది. అయినా సరే.. వీరి మాటకు పార్టీలో విలువ లేదనే ప్రచారం జోరుగా జరుగుతోంది. గుంటూరు మిర్చి యార్డు పదవికి పల్నాడు జిల్లా నేతను ఎంపిక చేయడం.. గుంటూరు నేతలకు మింగుడు పడటం లేదు. అదే సమయంలో చైర్మన్‌గా ఎన్నికైన వ్యక్తిని తామెవరు రికమండ్ చేయలేదనేది సీనియర్ల మాట. ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ధైర్యంగా బయటకు రావటం లేదు. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే లు, టీడీపీ నాయకుల మౌనం వెనుక అసలు కారణం ఏమిటనే విషయం టీడీపీ కార్యకర్తలకు కూడా అంతుబట్టటం లేదు.

