ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించ నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనంకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో ఈ సభను నిర్వహించాలని జనసేన పార్టీ ప్రణాళిక రూపొందించినప్పటికీ, శాంతిభద్రతల కారణాలను చూపుతూ పోలీసులు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో అధికారిక వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో భద్రతా బల గాలన్నీ ఆ విధుల్లో నిమగ్నమై ఉంటాయని పోలీసులు తెలిపారు. అదే రోజు రాజకీయ సభ నిర్వహిస్తే ట్రాఫిక్ సమస్యలతో పాటు శాంతిభద్రతల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహణకు అనుమతి నిరాకరిస్తూ సంబంధిత అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది.
Also Read : టయోటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. సింగిల్ ఛార్జ్‌పై 543 కిమీ రేంజ్..!
పోలీసుల నిర్ణయంపై జనసేన పార్టీ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పార్టీ తరపున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సభ నిర్వహణ తమ ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొంటూ అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోరినట్లు తెలిసింది. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. కొందరు రాజకీయ నాయకులు సభ నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, తెలంగాణలో పార్టీ విస్తరణలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని జనసేన వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలను సమీకరించి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయడమే లక్ష్యమని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉండంటతో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కోర్టు తీర్పు అనంతరం సభ నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తెలంగాణ రవాణా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్యం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ ‘నవనిర్మాణ సభ’ నిర్వహించనున్నట్లు ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరిపై పొన్నం ప్రభాకర్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. బీజేపీతో చేసుకున్న ఒప్పందాల మేరకే పవన్ కల్యాణ్ తన రాజకీయ నటనను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో నిర్వహించబోయే నవ నిర్మాణ సభ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని విమర్శించారు. తెలంగాణను బీజేపీకి తాకట్టు పెట్టడమే పవన్ చేసే నవ నిర్మాణమా అని పొన్నం ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిసే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ ప్రజలను గౌరవించే విధంగా ప్రతి ఒక్కరు వ్యవహరించాలన్నారు.
జనసేన నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి నిరాకరణ ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. పవన్ కల్యాణ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండగట్టు ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున రూ.35 కోట్లు ప్రకటించినప్పుడు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికిన కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు సభకు అనుమతి ఎందుకు నిరాకరించిందో జవాబు చెప్పాలంటున్నారు. కొన్ని నెలల క్రితం అభినందనలు, ఇప్పుడు ఆంక్షలా..? ఒకే వ్యక్తిపై రెండు రకాల వైఖరి ఎందుకు..? అని నిలదీస్తున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ భేదాలు ఉండొచ్చు, కానీ సభలకు అనుమతులు రాజకీయ లాభనష్టాల ఆధారంగా నిర్ణయించడం సరైంది కాదంటున్నారు.
Also Read : టీడీపీలో రాజ్యసభ సీట్లు విధేయులకా లేక అవకాశవాదులకా?
అలాగే 2 వేల మందికి సరిపడే సామర్థ్యం ఉన్న ఒక హాల్‌లో సమావేశం పెట్టుకుంటే.. లా అండ్ ఆర్డర్ సమస్య, పార్కింగ్ సమస్య అంటూ అనుమతి నిరాకరించడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. ఇప్పుడు ఇలా సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడానికి ప్రజాస్వామ్య వాదులు ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ హాల్‌లో నిత్యం ఎన్నో సాంస్కృతిక, రాజకీయ, కార్పొరేట్ కంపెనీల సమావేశాలు జరుగుతూనే ఉంటాయని.. అప్పుడు ఎప్పుడూ రాని పార్కింగ్ సమస్య జనసేన పార్టీ కార్యక్రమానికి అడ్డంకిగా చూపి నిరాకరించడం సహేతుకం కాదంటున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని అభివర్ణిస్తున్నారు.

