ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ-3 ప్రభుత్వం మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దేశ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ముఖ్యంగా కేంద్రంలో కీలక మిత్రపక్షంగా కొనసాగుతున్న టీడీపీకి ఈసారి మరింత ప్రాధాన్యత దక్కుతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మార్పులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ, పాలనలో మరింత వేగం తీసుకురావడం, మిత్రపక్షాలను సంతృప్తి పరచడం, ప్రాంతీయ సమీకరణాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ పునర్వ్యవస్థీకరణ ఉండబోతుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
Also Read : గెట్ రెడీ ఫర్ వార్.. పవన్ వార్నింగ్..!
ప్రస్తుతం ఏపీ నుంచి టీడీపీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. వీరి పనితీరుపై ప్రధాని సంతృప్తిగా ఉన్నప్పటికీ, రాష్ట్రానికి అదనపు ప్రాతినిధ్యం కల్పించే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేరు బలంగా వినిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం, మహిళా ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అనుభవజ్ఞురాలైన పురందేశ్వరికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చే అవకాశాలపై ప్రచారం సాగుతోంది. అదే సమయంలో టీడీపీకి మరో సహాయ మంత్రి పదవి లేదా కేబినెట్ స్థాయి ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ ఎంపీల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో, కేంద్రంలో రాష్ట్రానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఉండటం ద్వారా కీలక ప్రాజెక్టులకు నిధుల సమీకరణ సులభమవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. పోలవరం, రాజధాని అభివృద్ధి, పరిశ్రమల పెట్టుబడులు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కీలకంగా మారిన నేపథ్యంలో ఢిల్లీలో ఏపీ బలం పెరగాలని రాష్ట్ర నాయకత్వం కోరుకుంటోంది. మరోవైపు బీజేపీ కూడా వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏపీలో తన రాజకీయ స్థావరాన్ని బలోపేతం చేసుకోవాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. టీడీపీతో మైత్రిని కొనసాగిస్తూ, అదే సమయంలో తన సొంత నేతలకు కూడా గుర్తింపు ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈసారి మంత్రివర్గ విస్తరణలో రాజకీయ సమతుల్యతకు అధిక ప్రాధాన్యం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : సినిమా ఇండస్ట్రీ వల్ల చాలా కోల్పోయా..!
అదేవిధంగా కొందరు ప్రస్తుత మంత్రుల పనితీరును సమీక్షించి, ఫలితాలు ఆశించిన స్థాయిలో లేని వారిని తప్పించి కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం. యువ నాయకత్వానికి అవకాశమివ్వడం, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకోవడం, మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించడం వంటి అంశాలు ఈ పునర్వ్యవస్థీకరణలో ప్రధానంగా ఉండే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జూన్ తొలి వారంలో ఈ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో, ఏపీ నుంచి ఎవరికి పదవులు దక్కుతాయి..? ఎవరికీ ప్రమోషన్ లభిస్తుంది..? టీడీపీకి అదనపు ప్రాధాన్యం ఎంతవరకు లభిస్తుంది..? అన్న అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చేర్చ కొనసాగుతోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ఉత్కంఠ కొనసాగనుంది.

