పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజైన సోమవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో ఊహించని స్థాయిలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చిన సంసద్ చలో అంటే చలో పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఘర్షణకు దారితీసింది. నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించగా, కొందరు రాళ్లు రువ్వారు. ఈ ఘర్షణల్లో 118 మందికి పైగా పోలీసు సిబ్బందితో పాటు నిరసనకారులు సైతం గాయపడ్డారు.
Also Read : వైసీపీ నయా గేమ్ ప్లాన్.. సూపర్ ఫ్లాప్..!
అటు భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేశారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం నిరసనకారులతో చర్చల మార్గాన్ని తెరిచింది. కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు సోమవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో రెండుసార్లు భేటీ అయ్యారు. ఉదయం జరిగిన మొదటి సమావేశంలో డిమాండ్లను రాతపూర్వకంగా ఇవ్వాలని మంత్రి కోరగా, సాయంత్రం 4 గంటలకు సీజేపీ ప్రతినిధులు తమ మూడు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. అయినప్పటికీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు వెనక్కి తగ్గేదే లేదని సిజెపి స్పష్టం చేసింది.
Also Read : కాక్రోచ్ దెబ్బకు దిగివచ్చిన కేంద్ర సర్కార్..!
సోమవారం రాత్రి ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసన వేదికను తొలగించినప్పటికీ, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సీజేపీ మద్దతుదారులు మళ్లీ అక్కడికే చేరుకుని తాత్కాలిక టెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే మాట్లాడుతూ.. తాము జంతర్ మంతర్ మైదానాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, మంగళవారం కూడా పార్లమెంట్ వైపు తమ మార్చ్ కొనసాగుతుందని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు నిరసనల వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో ఢిల్లీ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు.

