ఐపీఎల్ అంటేనే ఆఖరి వరకు ఉత్కంఠ, ట్విస్టులు కామన్. కానీ ఈసారి అంతకంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. టోర్నమెంట్ నుంచి ఎప్పుడో బోర్డర్ దాటి వెళ్ళిపోయిన రెండు జట్లు ఇప్పుడు ప్లేఆఫ్స్ ఆశలతో ఉన్న మిగతా జట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అవును, మనం మాట్లాడుకుంటోంది ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్, కోట్లు కుమ్మరించినా కిందా మీదా పడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ గురించే. లీగ్ మ్యాచ్ లు ముగుస్తున్న తరుణంలో ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగున 8 పాయింట్లతో ఉన్నాయి.
తాము ప్లేఆఫ్స్ రేసు నుండి అధికారికంగా అవుట్ అయ్యామనే బాధ కంటే.. కష్టపడి పైకి వస్తున్న మిగతా టీంలని కిందకి లాగడంలోనే వీరికి ఎక్కువ ఆనందం దొరుకుతున్నట్లుంది. నిన్న గాక మొన్న ముంబై ఇండియన్స్ జట్టు పంజాబ్ కింగ్స్ ను ఓడించి షాకిచ్చింది. ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఆరాటపడుతున్న పంజాబ్ కు ఆ మ్యాచ్ ఎంత ముఖ్యమో ముంబైకి అంత అనవసరం. మేము ఎలాగూ ఇంటికి వెళ్తున్నాం, మాతో పాటు మీరు కూడా ప్యాకింగ్ మొదలుపెట్టండి అన్నట్లుగా ముంబై పంజాబ్ ఆశలను దెబ్బకొట్టింది.
ఇక నిన్న లక్నో సూపర్ జెయింట్స్ మరో అడుగు ముందుకు వేసి డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కు గట్టి షాకిచ్చింది. టేబుల్‌లో సేఫ్ గా ఉండాలనుకున్న రుతురాజ్ సేనను నట్టేట ముంచి, లక్నో తన కసిని తీర్చుకుంది. తాము గెలవకపోయినా పర్లేదు కానీ, ప్లేఆఫ్స్ రేసులో ఉన్న టీంలను ఎలా దెబ్బకొట్టాలో ఈ రెండు జట్లు బాగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ దెబ్బతో పాయింట్ల పట్టికలో టాప్-4 లో ఉన్న ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ వంటి జట్ల లెక్కలన్నీ తలకిందులవుతున్నాయి.

