పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేగుతోంది. ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్.. టీఎంసీకి చెందిన దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, బీజేపీ కేంద్ర నాయకత్వం పచ్చజెండా ఊపితే వారంతా కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖన్ సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ వీరందరినీ చేర్చుకోవాలని బీజేపీ నిర్ణయిస్తే తృణమూల్ కాంగ్రెస్ ఒక రాజకీయ శక్తిగా ఉనికినే కోల్పోతుందని కూడా సౌమిత్ర ఖన్ పేర్కొన్నారు. అయితే, సౌమిత్ర ఖన్ చేసిన ఈ వ్యాఖ్యలను తృణమూల్ సీనియర్ ఎంపీ సౌగతా రాయ్ పూర్తిగా ఖండించారు. ఇదంతా అబద్ధమని, బీజేపీ ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని కొట్టిపారేశారు.
Also Read : విరాళంలో వేమిరెడ్డి దంపతుల రికార్డ్..!
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై సౌమిత్ర ఖన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనను ఒక ‘పాపి’గా అభివర్ణిస్తూ, పాపం చేసిన వారు జైలుకు వెళ్లక తప్పదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన ఇంటి ముందు బుల్డోజర్ సిద్ధంగా ఉందని, గతంలో బీజేపీ కార్యకర్తల ఇళ్లను కూల్చివేయించినందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఘాటుగా విమర్శించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు మండుతున్నాయి. అవినీతి ఆరోపణలు, అంతర్గత విబేధాల నడుమ బారాసత్ టీఎంసీ ఎంపీ కాకొలి ఘోష్ దస్తీదార్, ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన ఒక అధికారిక సమీక్షా సమావేశానికి హాజరుకావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read : మోదీ సర్కార్‌కు పుష్కరం.. బీజేపీ భారీ ప్లానింగ్..!
ఇటీవల లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్ పదవి నుంచి కాకొలి ఘోష్‌ను తొలగించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై-కేటగిరీ భద్రతను కల్పించడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలకు చెందిన దాదాపు 100 మంది కౌన్సిలర్లు ఇటీవల రాజీనామా చేయడం తృణమూల్ పునాదులను కదిలిస్తోంది. భట్ఫరా మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ రేబా రాహా సహా 35 మంది కౌన్సిలర్లలో 30 మంది టీఎంసీకి రాజీనామా చేశారు. హలిసహర్‌లో 16 మంది, కాంట్రాపారలో 14 మంది కౌన్సిలర్లు రాజీనామాలు సమర్పించారు. కోల్ కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ కూడా తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మున్సిపల్ వ్యవహారాల మంత్రి అగ్నిమిత్ర పాల్ ఇప్పటికే కౌన్సిలర్లు లేని మున్సిపాలిటీలకు అడ్మినిస్ట్రేటర్లను నియమిస్తామని ప్రకటించారు. దీనికి తోడు మున్సిపల్ నియామకాల అవినీతి కేసులో మాజీ మంత్రి సుజిత్ బోస్ అరెస్ట్ కావడం, పలువురు నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా కొనసాగుతుండటం టీఎంసీని కలవరపెడుతోంది.

