బాల్క సుమన్.. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు. ఉస్మానియా విద్యార్థిగా మొదలైన ప్రయాణం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకుంది. నాటి ఉద్యమ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దలకు చేదోడు వాదోడుగా ఉంటూ.. ఉస్మానియా నుంచే తన రాజకీయ ప్రయాణానికి బాటలు వేసుకున్నాడు. తన దూకుడుతో ఆంధ్ర ప్రాంత ఉద్యోగులపైన, వ్యాపారాలపైన, ప్రజల పైన దాడులు చేసిన బాల్క సుమన్.. నాటి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో పాటు కల్వకుంట్ల రామారావు, తన్నీరు హరీష్ రావు దృష్టిలో పడటమే కాకుండా.. వారికి అత్యంత సన్నిహితంగా మారిపోయారు.
Also Read : మహానాడులో చారిత్రాత్మక ఘట్టం.. తొలిసారి ట్రాన్స్ జెండర్ స్పీచ్..!
ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న బాల్క సుమన్.. కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నేత ప్రశ్నలకు జవాబు చెప్పలేక.. లైవ్ లోనే దాడి చేశాడు. ఆ దాడి కూడా అతని రాజకీయ ప్రయాణానికి ఓ కారణం. దాడులు చేసిన వారికే పదవులు అన్నట్లుగా అప్పట్లో టీఆర్ఎస్ పెద్దలు వ్యవహరించారు. దీంతో బాల్క సుమన్‌కు నాటి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతగా మంచి గుర్తింపు ఇచ్చారు. దాడులు, ధర్నాలు, నిరసనలు, ఆందోళనల కోసం విద్యార్థులను రెచ్చగొట్టడం, భారీగా వారిని సమీకరించడం వంటి పనులకు బాల్క సుమన్‌ను వాడుకున్నారనేది బహిరంగ రహస్యం. ఉద్యమంలో యువత ఆత్మహత్యలకు బాల్క సుమన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా ఒక కారణం అనేది ప్రధాన ఆరోపణ.
ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బాల్క సుమన్‌కు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఎంపీగా పెద్దపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి క్లీన్ వైట్ పేపర్ మాదిరిగా మారిపోయాడు. పార్లమెంట్ సభ్యునిగా పెద్దగా ఏం చేసింది లేదనేది సుమన్‌పై ఆరోపణలు. ఇక 2018లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా గెలిచారు. ఈ గెలుపు తర్వాత కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో.. మంత్రిపదవి ఖాయమనుకున్నారు. కానీ ఛాన్స్ రాలేదు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నడు.
Also Read : ఏపీ మైనింగ్ కుంభకోణంపై ఈడీ గురి..? అరెస్ట్ లు ఖాయమా..?
ఇక టీపీసీసీ చీఫ్ స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డిపై నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశాడు బాల్క సుమన్. పదే పదే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశాడు. ఎలా గెలుస్తావో చూస్తా అంటూ సవాల్ చేసిన సుమన్.. మీ ఇంటికి వస్తా.. అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇదంతా ఎన్నికల ముందు కథలు. 2023 ఎన్నికల తర్వాత బాల్క సుమన్ మాయమైపోయాడు. కాంగ్రెస్ గెలుపు తర్వాత బాల్క సుమన్ అరెస్టు ఖాయమనే పుకార్లు కూడా వినిపించాయి. దీంతో.. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా సుమన్ కనిపించలేదు. కానీ రెండున్నరేళ్ల తర్వాత ఇటీవల తెలంగాణ భవన్‌లో జరిగిన ఓ సమావేశంలో సుమన్ పాల్గొన్నాడు. ఆ సమయంలో అతని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి.
పోరాడదాం అంటూ పిలుపునిచ్చిన బాల్క సుమన్.. అందుకు మిలిటెంట్ తరహా పోరాటం చేయాలన్నారు. రైలు పట్టాలు కోసేయ్యాలని, సింగరేణి భవనాన్ని తగలబెట్టాలంటూ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. మహా అయితే అరెస్టు చేస్తారు.. అంతే కదా.. అది కూడా మంచిదే కదా.. అంటూ నవ్వుతూ జవాబిచ్చారు. ఒక మాజీ ఎంపీ, ఎమ్మెల్యే.. ఇలా మిలిటెంట్ పోరాటం అంటూ హింసను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపుతోంది. రైలు పట్టాలు కోసేయడం, ఆఫీసులు తగలబెట్టడం, మిలిటెంట్ ఉద్యమం చేయడం లాంటివి .. సమాజానికి హాని చేసేవి. విధ్వంసకర వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న సుమన్‌ను బీఆర్ఎస్ అధిష్ఠానం పార్టీ నుంచి బహిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దేశ జాతీయ సంపదను ధ్వంసం చేయమనడం దారుణమని.. ఇది బీఆర్ఎస్ కూడా నష్టం కలిగిస్తాయని రాజకీయ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.

