ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న మైనింగ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీ మైనింగ్ స్కామ్ పై రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ గతంలో నమోదు చేసిన కేసును ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు మనీలాండరింగ్ కోణంలో విచారణను తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగానే బుధవారం నాడు దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక నగరాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈడీ ప్రత్యేక బృందాలు కేంద్రీయ బలగాల రక్షణతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టాయి.
Also Read : మోదీ సర్కార్‌కు పుష్కరం.. బీజేపీ భారీ ప్లానింగ్..!
హైదరాబాద్, విజయవాడ, జైపూర్, కోయంబత్తూరు నగరాల్లోని దాదాపు పలు ప్రాంతాలలో ఈ తనిఖీలు కొనసాగాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రముఖ మైనింగ్, ఇన్ ఫ్రా కంపెనీలైన జేపీవీఎల్, జీసీకేసీ ప్రాజెక్ట్స్, ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యాలయాలు, వాటి నిర్వాహకుల నివాసాలపై ఈడీ అధికారులు గురిపెట్టారు. ఈ మొత్తం కుంభకోణంలో ఏపీ మైన్స్ అండ్ జియాలజీ శాఖ మాజీ డైరెక్టర్ వి.జి. వెంకటరెడ్డి పాత్రపై ఈడీ ప్రధానంగా విచారణ జరుపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఆయన మైనింగ్ లీజులు, ఇసుక క్వారీయింగ్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారనే ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్ లోని సదరు కార్పొరేట్ కంపెనీలతో వెంకటరెడ్డి జరిపిన ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ఆధారాలు, డైరీలు మరియు బ్యాంక్ అకౌంట్లను ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రాథమిక విచారణ మరియు ఏసీబీ నివేదికల ప్రకారం.. మాజీ డైరెక్టర్ వి.జి. వెంకటరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.2,500 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు.
Also Read : కోట్లకు కొన్నా.. జట్లకు తూట్లు పొడిచారు
సీనరేజ్ ఫీజుల మినహాయింపు, అక్రమ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం ద్వారా ఈ భారీ స్కామ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లు, బినామీ పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను ఈడీ సీజ్ చేసినట్లు సమాచారం. ఏపీ మైనింగ్ వ్యవహారంలో లబ్ధి పొందిన మరికొంతమంది రాజకీయ నేతలు, ఐఏఎస్ అధికారుల పేర్లు కూడా ఈ విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుండటంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు మైనింగ్ కార్పొరేట్ కంపెనీల్లో తీవ్ర కలకలం రేగుతోంది.

