దక్షిణ భారతదేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ అనేది ఒక సరికొత్త ట్రెండ్‌గా మారింది. ఒకప్పుడు కేవలం సంక్షేమ పథకంగా భావించిన ఈ నిర్ణయం, నేడు ఎన్నికల్లో గెలుపోటములను శాసించే స్థాయికి చేరుకుంది. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఫ్రీ బస్సు మంత్రాన్నే జపిస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణాది వ్యాప్తంగా ఈ పథకం ఏ విధంగా విస్తరిస్తుందో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
Also Read : విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ చీప్ ట్రిక్స్..!
ముందుగా కర్ణాటకలో శక్తి పథకం పేరుతో మొదలైన ఈ ప్రవాహం, ఆ తర్వాత తెలంగాణలో మహాలక్ష్మి పథకంగా రూపాంతరం చెందింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ హామీ కీలక భూమిక పోషించింది. అదే బాటలో ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుతో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తూ మహిళల మద్దతును కూడగట్టుకుంటోంది. ఈ పథకాలు క్షేత్రస్థాయిలో విజయవంతం కావడంతో పక్క రాష్ట్రాల్లోని పార్టీలకు ఇది ఒక అనివార్యమైన హామీగా మారిపోయింది.
Also Read : నిజంగా కేసీఆర్ కు పుడితే.. బండి సంజయ్ సంచలనం..!
వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఇందిర గ్యారెంటీ పేరుతో ఉచిత బస్సు ప్రయాణ హామీని తమ మేనిఫెస్టోలో చేర్చింది. అటు తమిళనాడులో కూడా రాజకీయ అరంగేట్రం చేసిన దళపతి విజయ్, తన తమిళగ వెట్రి కళగం పార్టీ ద్వారా వెట్రి పయనం అనే పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు.
మొత్తానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మహిళా ఓటర్ల ఆశీస్సులు తప్పనిసరి అని ఈ పథకాలు నిరూపిస్తున్నాయి. సామాన్యుడి జేబు భారం తగ్గించే ఈ ఉచిత ప్రయాణం, అటు ఆర్థికంగా మహిళలకు మేలు చేస్తున్నప్పటికీ, ఇటు రాజకీయాల్లో మాత్రం ఒక శక్తివంతమైన అస్త్రంగా మారిపోయింది. రాబోయే రోజుల్లో మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ పథకం ఏ తరహా ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

