జనసేన పార్టీ అధినేత సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రిపదవి ఇవ్వడానికి చంద్రబాబు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. వాస్తవానికి నాగబాబుకు కేబినెట్ బెర్త్ ఖాయమనే మాట టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని టీడీపీ అధికారిక లెటర్ హెడ్‌కపైన స్వయంగా ప్రకటన జారీ చేసింది. నాటి నుంచి.. పదవి ఎప్పుడిస్తారనే చర్చ జోరుగా జరుగుతోంది. నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన తర్వాతే కేబినెట్‌లోకి తీసుకుంటారని కొందరు పార్టీ పెద్దలు చెప్పిన మాటే నిజమైంది. ముందుగా ఎమ్మెల్సీగా గెలిపించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నుంచే మంత్రి పదవి ఎప్పుడిస్తారంటూ జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు కూడా. అయితే దీనిపై అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
Also Read : కాకాని పై గురి.. గవర్నర్ అనుమతి ఇస్తారా..?
వాస్తవానికి మంత్రివర్గంలో ఖాళీగా ఒక స్థానాన్ని కూడా జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబుతో భర్తీ చేయనున్నట్లు అందరికీ తెలిసిపోయింది. అయితే ముహుర్తం ఎప్పుడంటూ వస్తున్న ప్రశ్నలకు ఉగాది పండుగ నాటికి మంత్రివర్గ విస్తరణ పూర్తి చేస్తామనే మాట తొలి నాళ్లలో బలంగా వినిపించింది. దీంతో ఉగాది రోజే మంత్రిగా తమ నేత నాగబాబు ప్రమాణం చేస్తాడంటూ ఆయన అభిమానులు, జనసైనికులు ఆశపడ్డారు. పైగా సోషల్ మీడియాలో కూడా నాగబాబుకు ఇచ్చే శాఖలివే అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బ్రేక్ వేసినట్లైంది. అసలు నాగబాబుకు మంత్రిపదవి ఇప్పట్లో ఇచ్చే అవకాశం కూడా లేదనే మాట వినిపిస్తోంది.
Also Read : వైసీపీకి గ్రోక్ షాక్.. ఏం చెప్పిందంటే..
ఉగాది డుగ రోజున పీ4 కార్యక్రమం ప్రారంభం కోసం కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. పీ4 ద్వారా రాష్ట్రంలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వస్తాయనేది తొలి నుంచి చంద్రబాబు చెబుతున్న మాట. అందుకే పీ4 కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమం ప్రారంభం కోసం 200 ఎకరాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సుమారు 30 వేల మంది సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగాది పండుగ రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహించనున్నారు. సభ కోసం ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా మహిళలను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు కూడా.
Also Read: బ్రేకింగ్: లావు భద్రతపై సర్కార్ అలెర్ట్
ఓ వైపు పీ4 కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఇలాంటి సమయంలో మంత్రివర్గ విస్తరణ చేపడితే.. పీ4 విషయం మొత్తం డైవర్ట్ అవుతుందని.. దీని వల్ల ప్రజలకు అసలు విషయం నేరుగా తెలియదని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో టీడీపీ నేత వర్మపై నాగబాబు పరోక్షంగా కామెంట్ చేశారు. ఈ వ్యవహారం తెలుగుదేశం, జనసేన పార్టీ మధ్య పెద్ద దుమారం రేపింది కూడా. ఇలాంటి సమయంలో నాగబాబుకు మంత్రిపదవి ఇస్తే… టీడీపీ కార్యకర్తలు మరింత ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట. అందుకే ప్రస్తుతానికి నాగబాబు మంత్రిగా ప్రమాణం చేసే కార్యక్రమాన్ని తాత్కాలికంగా చంద్రబాబు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

