ప్రస్తుతం రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నాలుగు స్థానాలు కూడా మెజారిటీ లెక్కల ప్రకారం తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే చేరాయి. అయితే కూటమి పొత్తు కారణంగా.. ఈ స్థానాలు ఎవరికి కేటాయిస్తారనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. రాజ్యసభలో పూర్తి పట్టు సాధించే వ్యూహాలను బీజేపీ అమలు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించే లెక్కలు సిద్దం చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్న వేళ ఈ సారి బీజేపీకి సీటు ఇవ్వలేమని టీడీపీ సంకేతాలు ఇస్తోంది. ఇదే సమయంలో బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఏపీ నుంచి బరిలో నిలిపేందుకు ఊహించని విధంగా అభ్యర్థిని ఎంపిక చేసినట్లు పార్టీ నేతల సమాచారం.
Also Read : రేవంత్ సూపర్ సక్సెస్.. గులాబీలో గుబులు..!
రాజ్యసభలో పూర్తి మెజార్టీ సాధించే దిశగా బీజేపీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ.. సీఈసీ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి సుదీర్ఘంగా కసరత్తు నిర్వహించారు. రాష్ట్రాల వారీగా పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు, రాజకీయ సమీకరణాలపై మోదీ, అమిత్ ఆరా తీశారు. మొత్తం 24 స్థానాల్లో 11 సీట్లలో బీజేపీ నేరుగా అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్‌డీయే మిత్రపక్షాల అభ్యర్థులు ఆరు స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. మూడు పార్టీలు ఈ సీట్ల షేరింగ్ పైన కసరత్తు చేస్తున్నాయి. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీ నుంచి ఇప్పటికే ఇద్దరు బీజేపీ అభ్యర్థులు రాజ్యసభకు ఎంపిక అయ్యారు. దీంతో.. ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వలేమని టీడీపీ అధినాయకత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లుగా పార్టీ నేతల సమాచారం. టీడీపీ మూడు.. జనసేన
ఒక సీటు తీసుకోవాలని భావిస్తున్నాయి. కాగా.. ఇదే అంశం పైన చర్చించిన బీజేపీ అధినాయకత్వం ఏపీ నుంచి ఒక సీటు దక్కించుకునేలా టీడీపీ అధినేత చంద్రబాబుతో నేరుగా చర్చించాలని నిర్ణయించింది.
Also Read : పవన్ సభకు బ్రేకులు.. రాజకీయ కక్ష సాధింపేనా..?
కూటమి అభ్యర్థిగా ఏపీ నుంచి మాజీ ప్రధాని దేవగౌడతో సహా మరో ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కర్ణాటక నుంచి దేవగౌడ రాజ్యసభకు 2020లో ఎంపికై.. ఇప్పుడు పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రం నుంచి బీజేపీ – జేడీ (ఎస్) పొత్తులో భాగంగా దేవగౌడకు ఇవ్వాలనే ఒత్తిడి బీజేపీ పైన పెరుగుతోంది. అయితే.. మాజీ మంత్రి సదానందగౌడ వైపు బీజేపీ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో.. చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే దేవగౌడ కోసం మంత్రి కుమార స్వామి నేరుగా మాట్లాడాలని సూచించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాలతో అక్కడి నుంచే దేవగౌడకు అవకాశం కల్పిస్తే అన్నామలై.. మంద కృష్ణ మాదిగలో ఒకరికి ఏపీ నుంచి అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో.. ఏపీ నుంచి ఎలాగైనా ఒక సీటు దక్కించుకోవాలని బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. కాగా, బీజేపీ ప్రతిపాదనల పైన చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.

