ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు విజయవంతంగా ముగియడంతో కూటమి ప్రభుత్వం ఇప్పుడు క్షేత్రస్థాయిలో మరో కీలక ఎన్నికల నిర్వహణకు కసరత్తు వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 2,050 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పాలకవర్గాల ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, నోటిఫికేషన్ విడుదలకు ముందే పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తోంది.
Also Read : మాజీలకు షాక్.. ఎందుకిలా..?
ఈ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ జిల్లా సహకార అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. రైతు సేవా కేంద్రాల వారీగా ప్రాథమిక ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి, ఈ-పీఏసీఎస్ ఈఆర్‌పీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటు ఓటర్లకు అనుకూలంగా ఉండేలా పోలింగ్ కేంద్రాలను గుర్తించడం, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే అంచనా వేసి నివేదించడం వంటి పనులను ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. ఈ సన్నాహక చర్యలపై ఇప్పటివరకు చేపట్టిన పూర్తి కార్యాచరణ నివేదికను రాబోయే పది రోజుల్లోగా సమర్పించాలని కమిషనర్ గడువు విధించారు.
Also Read : మేనత్త ఊరిలో జగన్‌కు షాక్.. 20 ఏళ్ల ఆధిపత్యానికి బ్రేక్!
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిన వెంటనే సహకార ఎన్నికల జాతర ప్రారంభం కానుంది. అంతా అనుకున్నట్లు జరిగితే, వచ్చే ఏడాది జనవరి నెలలో ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సహకార ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. గతంలో 2013 జనవరిలో పీఏసీఎస్ ఎన్నికలు జరగ్గా, వాటి ఐదేళ్ల కాలపరిమితి 2018 నాటికే ముగిసిపోయింది. అప్పటి నుంచి పాలకవర్గాలు లేక పెండింగ్‌లో పడిన ఈ సహకార సంఘాలకు దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఎన్నికలు జరగనుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సందడి నెలకొంది.


