ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో ఏర్పడిన సాంకేతిక అంతరాయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నవంబర్ 12న మొదలైన ఈ సమస్య శుక్రవారం కూడా కొనసాగడంతో భారత్ సహా 74 దేశాల్లోని లక్షలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్, టీమ్స్, వర్డ్, ఎక్సెల్, వన్‌డ్రైవ్, కోపైలట్ వంటి కీలక అప్లికేషన్లు పనిచేయకపోవడంతో ఐటీ కార్యాలయాలు, ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థల రోజువారీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి.
Also Read : ఇరాన్ విషయంలో ట్రంప్, నెతన్యాహు మధ్య తీవ్ర గొడవలు..?
ఈ సాంకేతిక లోపం కారణంగా భారత్‌లో విమానయాన రంగానికి సైతం ఇబ్బందులు తప్పలేదు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి పుణె, లేహ్, ముంబయి నగరాలకు బయలుదేరాల్సిన మూడు స్పైస్‌జెట్ విమానాలు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యమయ్యాయి. మరోవైపు, ఈ అంతరాయం వెనుక ఎటువంటి సైబర్ దాడి జరగలేదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. సర్వర్ల కాన్ఫిగరేషన్‌లో చేసిన మార్పుల వల్ల ఒక్కసారిగా సర్వర్లపై విపరీతమైన భారం పడి అవి నిలిచిపోయాయని, మిగిలిన సర్వర్లకు ట్రాఫిక్ మళ్లించడంతో అవి కూడా మొరాయించాయని సంస్థ వివరించింది.
Also Read : గిరిజనుల అభిమానం పవన్ కు ఓట్లుగా ఎందుకు మారలేదు?
దెబ్బతిన్న సర్వర్లను ఇంజినీర్లు పునరుద్ధరించిన వెంటనే మళ్లీ ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోతుండటంతో అవి తిరిగి ఆగిపోతున్నాయని, అందువల్లే సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి ఎక్కువ సమయం పడుతోందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కేవలం ఒకే క్లౌడ్ సర్వీస్‌పై ప్రపంచవ్యాప్తంగా సంస్థలు అతిగా ఆధారపడటం వల్ల ఎంతటి ముప్పు పొంచి ఉందో ఈ ఘటన మరోసారి నిరూపించిందని, అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యామ్నాయ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


