దేశంలో ఇంధన విప్లవానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ముడి చమురు దిగుమతులను తగ్గించుకునే లక్ష్యంతో, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో 100 శాతం ఇథనాల్ వినియోగానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధికారికంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989 నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు దేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపిన ‘E20’ ఇంధనాన్ని విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు.
Also Read : ఎమ్మెల్యేల రాజీనామాపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
అయితే, తాజా సవరణల ద్వారా దాదాపు 100 శాతం స్వచ్ఛమైన ఇథనాల్‌తో నడిచే వాహనాలకు కూడా చట్టబద్ధమైన అనుమతులు లభించాయి. దీనితో పాటు 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమమైన E85 ఇంధనాన్ని కూడా ఉద్గారాల నిబంధనల పరిధిలోకి చేర్చారు. ఈ నిర్ణయంపై కేంద్ర రవాణా శాఖ అధికారులు కీలక స్పష్టత ఇచ్చారు. E-100 లేదా E85 ఇంధనాలు కేవలం ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యేకంగా డిజైన్ చేసి, ధృవీకరించిన ‘ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు’ మాత్రమే ఉపయోగపడతాయి.
Also Read : వారణాసి వాయిదా.. నిజమేనా..?
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాధారణ పెట్రోల్ కార్లు లేదా E20 వాహనాల్లో ఈ 100% ఇథనాల్‌ను వాడటానికి వీల్లేదు. సరికొత్త నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయ ఇంధనాల పరిధిని పెంచుతూ బయోడీజిల్ ప్రమాణాలను B10 నుండి B100 వరకు అప్‌గ్రేడ్ చేశారు. ఈ ఇంధన మార్పుల పరిధిలోకి వచ్చే లైట్ పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల బరువు పరిమితిని గతంలో ఉన్న 3,000 కేజీల నుండి 3,500 కేజీలకు పెంచారు. ఇప్పటికే మారుతి సుజుకి, టొయోటా, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి దిగ్గజ సంస్థలు దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ల తయారీపై వేగంగా అడుగులు వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అంతేకాకుండా, చెరకు, మొక్కజొన్న, ఇతర వ్యవసాయ వ్యర్థాల నుండి ఇథనాల్ తయారు చేయడం వల్ల భారత రైతులకు అదనపు ఆదాయం లభించి, ఆర్థికంగా మరింత బలోపేతం కానున్నారు.


