తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఓ గందరగోళం నెలకొంది. అదే వాయిదాల పర్వం. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత తూచ్ ఆ రోజు కాదు.. తర్వాత మళ్లీ చెబుతామంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ ఏడాది పెద్ద సినిమాలన్నీ దాదాపు వాయిదా పడినవే. పెద్ది ఏకంగా మూడు వాయిదాలు.. తర్వాత ప్యారడైజ్.. వెంకటేష్ హీరోగా వస్తున్న ఆదర్శ కుటుంబం.. ఇలా ఒకటేమిటి.. చాలానే ఉన్నాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే.. కొత్త సినిమా ఎప్పుడు అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో విడుదలవుతుందని ఫౌజీ దర్శక నిర్మాతలు ముందే ప్రకటించారు. కానీ రెండు నెలల ముందే.. అలా చేయటం లేదు.. వాయిదా వేస్తున్నామంటున్నారు. రిలీజ్ డేట్ ఊసే లేదు. అంటే విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదనే తెలుస్తోంది.
Also Read : విజయ్‌పై ట్రోలింగ్‌కు రష్మిక మందన్నా ఘాటు కౌంటర్..!
ఇలా పలు సినిమాల విడుదల తేదీలు మారుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాపై పడింది. రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఫ్రేమ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని.. అందుకే సినిమాలు ఆలస్యం అవుతాయని రాజమౌళి గురించి చెబుతారు. అందుకే రాజమౌళిని అంతా జక్కన్న అని కూడా అంటారు. గతంలో ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల విడుదల తేదీల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు మహేశ్ బాబు సినిమా విషయంలో కూడా అలాంటిదే జరుగుతుందా? అనే చర్చ మొదలైంది.
మహేశ్ బాబు కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేశ్ బాబు రుద్రగా.. శ్రీరాముడి పాత్రలోనూ మెప్పించనున్నాడు. ప్రియాంకా చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్.కార్తికేయ, కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దాదాపు 120 దేశాల్లో సినిమాను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Also Read : అతను మరో రహానే.. సౌతాఫ్రికా కెప్టెన్‌పై గవాస్కర్ ప్రశంసల జల్లు..!
అయితే.. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా కీలకం కానున్నాయి. ఇలాంటి సినిమాలకు నిర్మాణానంతర పనులు పూర్తిచేయడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇతర భారీ చిత్రాల విడుదల తేదీల్లో మార్పులు చోటు చేసుకుంటుండటంతో ‘వారణాసి’ విడుదలపై అభిమానుల్లో చర్చ మొదలైంది. అయితే, ఈ సినిమా విడుదల తేదీ మారబోతోందంటూ జరుగుతున్న ప్రచారానికి ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత లేదు. చిత్రబృందం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సినిమా విడుదలవుతుందా? లేక ఏదైనా మార్పు ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.


