ప్రపంచ దేశాలను వాతావరణ మార్పులు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే సహజ వాతావరణ ప్రక్రియ ఎల్ నినో రానున్న రోజుల్లో మరింత శక్తిమంతంగా మారనుందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పర్యావరణ పరిణామం 2026 చివరి నాటికి, 2027 ఫిబ్రవరి వరకు తీవ్ర రూపం దాల్చి కొనసాగే అవకాశం ఉందని అమెరికాలోని ప్రముఖ కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ అండ్ సొసైటీ తాజాగా అంచనా వేసింది.
Also Read : బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఎఫ్డీ రూల్స్ మారుతున్నాయా..?
వాతావరణ గమనాలను విశ్లేషించేందుకు శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న 22 అత్యాధునిక కంప్యూటర్ మోడళ్లను సర్వే చేశారు. ఈ 22 మోడళ్లు కూడా ఏకాభిప్రాయంతో ఎల్ నినో తీవ్రత విపరీతంగా పెరగబోతోందని ధ్రువీకరించాయి. రాబోయే శీతాకాలం అంతా దీని ప్రభావం 100 శాతం స్పష్టంగా ఉంటుందని, పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు.
Also Read : ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్కు బిగ్ షాక్..!
సాధారణంగా ఎల్ నినో వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను, వర్షపాత కొరతను హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఇండియన్ ఓషన్ డిపోల్ కొంతవరకు సమతుల్యం చేస్తుంది. అయితే, ఈసారి ఐఓడీ పాజిటివ్ ధోరణి కనబరిచినప్పటికీ, అది ఎల్ నినో ఉధృతిని ఎంతవరకు అడ్డుకోగలదనే అంశంపై వాతావరణ నిపుణులలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఎల్ నినో తీవ్రంగా మారితే ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాలు తగ్గడం, కరవు పరిస్థితులు ఏర్పడటం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి ముప్పు పొంచి ఉంది. ఇది భారత్ వంటి వ్యవసాయాధారిత దేశాలపై, ముఖ్యంగా పంట దిగుబడులు, జలాశయాల నీటి నిల్వలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎల్ నినో ఒక్కటే కాకుండా స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా వర్షాలను నిర్ణయిస్తాయని, దీనిపై ముందస్తు జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

