ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బులు దాచుకునే బ్యాంకు వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక సమాచారం అందించింది. బల్క్ డిపాజిట్ల అంటే భారీ మొత్తంలో చేసే డిపాజిట్లు ధరల ప్రక్రియలో మరింత పారదర్శకత, ఏకరూపత తీసుకురావడమే లక్ష్యంగా ఆర్బీఐ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి.
Also Read : ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్కు బిగ్ షాక్..!
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు ఇకపై రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే బల్క్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను ప్రతి పనిదినం ఉదయం 10 గంటల కల్లా తమ అధికారిక వెబ్సైట్లలో కచ్చితంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఒకసారి రేట్లను ప్రకటించిన తర్వాత.. అప్డేట్ చేయడానికి కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. వినియోగదారులు ఏ బ్రాంచ్ లేదా ఏ ఆన్లైన్ ఛానెల్ ద్వారా డిపాజిట్ చేసినా, ఆ రోజు వెబ్సైట్లో ప్రకటించిన వడ్డీ రేటునే వర్తింపజేయాల్సి ఉంటుంది.
Also Read : జగన్ ఎవరి చేతిలో కీలు బొమ్మ..?
అయితే, ఈ కొత్త నిబంధనల వల్ల సాధారణ రిటైల్ ఎఫ్డీ పెట్టుబడిదారులపై ఎలాంటి ప్రభావం ఉండదు. రూ. 1 లక్ష, రూ. 5 లక్షలు లేదా రూ. 25 లక్షల లోపు సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే సగటు మధ్యతరగతి కస్టమర్లకు పాత వడ్డీ రేట్ల విధానమే కొనసాగుతుంది. కేవలం రూ. 3 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేసే పెద్ద ఇన్వెస్టర్లకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. దీనివల్ల పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే వారికి విభిన్న బ్యాంకుల వడ్డీ రేట్లను సులభంగా పోల్చి చూసుకునే అవకాశం లభిస్తుంది.

