ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతాశిశు ఆరోగ్య సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని రాష్ట్రంలో మళ్లీ పునఃప్రవేశపెడుతూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవించే తల్లులకు, నవజాత శిశువులకు ఈ కిట్లను ఉచితంగా పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
Also Read : అమరావతికి క్యూ కడుతున్న ప్రతిష్ఠాత్మక సంస్థలు..!
పేద కుటుంబాలకు ప్రసవ సమయాల్లో ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు శిశువుల సంరక్షణకు అవసరమైన సామగ్రిని అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచడానికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంపై బాలింతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అత్యంత నాణ్యతా ప్రమాణాలతో రూపొందించిన ఒక్కో ఎన్టీఆర్ బేబీ కిట్ మార్కెట్ విలువ సుమారు 1,410 రూపాయలుగా నిర్ధారించారు.
Also Read : బ్రేకింగ్: వైసీపీ కీలకనేతలపై రౌడీ షీట్ లు..!
ఈ కిట్‌లో నవజాత శిశువు సంరక్షణకు అత్యంత అవసరమైన 14 రకాల విభిన్న వస్తువులను పొందుపరిచారు. ఇందులో భాగంగా చిన్నపిల్లల పరుపు, దోమతెర, వాటర్‌ప్రూఫ్ షీట్, శిశువులకు సరిపోయే సుతారమైన దుస్తులు, నాప్‌కిన్లు, సాఫ్ట్ టవల్స్ ఉంటాయి. వీటితో పాటు శిశువుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ఉపయోగపడేలా బేబీ పౌడర్, మైల్డ్ షాంపూ, బాడీ మసాజ్ ఆయిల్, బేబీ సోప్, సోప్ బాక్స్ లాంటి నిత్యావసర వస్తువులను అమర్చారు. పిల్లల మానసిక వికాసానికి ఉపయోగపడేలా ఒక చిన్న ఆటవస్తువును, వీటన్నింటినీ భద్రపరుచుకోవడానికి వీలుగా ఒక అందమైన కిట్ బ్యాగ్‌ను కూడా ప్రభుత్వం అందిస్తోంది.

