అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్ పై మైనింగ్, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీలు ఆసక్తిని రేపుతున్నాయి. రాయదుర్గం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, గతంలో జిల్లాలో వైసీపీ కీలక నేతగా ఉన్న, కాపు రామచంద్రారెడ్డికి చెందిన క్వారీలు, గనుల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. బొమ్మనహాళ్ మండలం నేమకల్లు పరిధిలో ఉన్న ఆయన మైనింగ్ ఏరియాలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ ఉమ్మడి తనిఖీలు నిర్వహించడం స్థానికంగా పెను సంచలనంగా మారింది.
Also Read : రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ పంచాయతీ..!
నేమకల్లు సమీపంలోని గనుల్లో అనుమతులకు మించి అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులకు ముందస్తు సమాచారం అందింది. దీనితో రంగంలోకి దిగిన మైనింగ్ మరియు వాణిజ్య పన్నుల శాఖల ప్రత్యేక బృందాలు క్వారీ ఏరియాను చుట్టుముట్టి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాయి. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ పనులు జరుపుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలోనే అక్రమ తవ్వకాలకు ఉపయోగిస్తున్న పలు భారీ యంత్రాలను అధికారులు అక్కడికక్కడే స్వాధీనం చేసుకున్నారు.
Also Read : చంద్రబాబుపై కేంద్ర మంత్రి ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మైనింగ్ పనులను, ఇతర క్రషర్లకు ముడి సరుకు రవాణాను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారుల ఆకస్మిక దాడులతో నేమకల్లు క్వారీ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మైనింగ్ యజమాన్యానికి సరైన పన్నుల చెల్లింపులు, రవాణా బిల్లులకు సంబంధించిన ఆధారాలు చూపించకపోవడంతో ముడి సరుకును తరలించడానికి వచ్చిన వందలాది లారీలు, టిప్పర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

