Thursday, September 17, 2026 02:41 PM
Thursday, September 17, 2026 02:41 PM

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ పంచాయతీ..!

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ భవిష్యత్ పై చర్చ మళ్లీ మొదలైంది. ఆముదాలవలస నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్‌ను నియమించినప్పటి నుంచి తమ్మినేని వర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజాగా ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ చేసిన వ్యాఖ్యలు ఈ విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయి. తమ్మినేని సీతారాం రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. 1983లో ఆముదాలవలస నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి, తిరిగి టీడీపీలోకి వచ్చిన ఆయన 2013 వైసీపీలో చేరారు. 2019లో ఆముదాలవలస నుంచి విజయం సాధించి, వైఎస్ జగన్ ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. 2024 ఎన్నికల్లో మాత్రం కూన రవికుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు.

Also Read: చరిత్రలోనే తొలిసారి.. పవిత్ర నగరం మక్కాలో ఎయిర్ రైడ్ అలర్ట్..!

2024 తర్వాత ఆముదాలవలస వైసీపీ బాధ్యతలను చింతాడ రవికుమార్‌కు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తమ్మినేని కుటుంబం మాత్రం నియోజకవర్గంపై తమ రాజకీయ పట్టు కొనసాగించాలని భావిస్తోందన్న చర్చ ఉంది. తన రాజకీయ వారసుడిగా కుమారుడు చిరంజీవి నాగ్‌ను ముందుకు తీసుకురావాలనే ఆలోచన తమ్మినేని వర్గంలో ఉన్నట్లు గతంలోనూ వార్తలు వచ్చాయి. మరోవైపు తమ్మినేని సీతారాంకు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం కూడా ఆయన రాజకీయ స్థానం విషయంలో కొత్త చర్చకు దారితీసింది. నియోజకవర్గ స్థాయి రాజకీయాల నుంచి పార్లమెంటు స్థాయి బాధ్యతలకు మారడం ఆయన వర్గానికి పూర్తిగా అనుకూలంగా లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇటీవల ఆముదాలవలసలో వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తమ్మినేని సీతారాం హాజరుకాలేదు. సమావేశంలో ఆయనపై పరోక్షంగా సొంత పార్టీ నాయకులే విమర్శలు చేసారు. ఈ వ్యాఖ్యలపై తమ్మినేని తనయుడు చిరంజీవి నాగ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. జిల్లాలోని వైసీపీ సీనియర్ నేతలు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావులపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. తమ్మినేని రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్లు ఉండవని, కామాలు మాత్రమే ఉంటాయని వ్యాఖ్యానించారు. జిల్లా పార్టీ వ్యవహారాల్లో ఒక వర్గానికే ప్రాధాన్యం దక్కుతోందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. జిల్లా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అధిష్ఠానం దృష్టి పెట్టాలని కోరారు. ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సొంత పార్టీపై తీవ్ర స్థాయిలో తమ్మినేని తనయుడు అసంతృప్తి చేయడం, సీతారం కాలంగా పార్టీ నిర్ణయాల పట్ల అసహనంతో ఉండడాన్ని గమనిస్తున్న వారు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో తమ్మినేని కుటుంబం కొనసాగుతుందా..? లేక రాజకీయంగా మరో దారి వెతుక్కుంటుందా..? అన్న ప్రశ్నలను వ్యక్తం చేస్తున్నారు. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తమ్మినేని మళ్లీ ఆ పార్టీలోకి వెళ్తారా..? లేక కూటమిలోని జనసేన వైపు అడుగులు వేస్తారా..? కేంద్రంలో అధికారంలో ఉంటూ రాష్ట్రంలో టీడీపీ, జనసేనలతో పొత్తుపెట్టుకున్న బీజేపీతో టచ్‌లో ఉన్నారా అన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. ఇప్పటివరకు తమ్మినేని సీతారాం లేదా ఆయన కుటుంబం నుంచి పార్టీ మార్పుపై ఎటువంటి సంకేతాలు వెలువడనప్పటికీ రకరకాల ప్రచారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. తమ్మినేని కుటుంబ అభిమానులు మాత్రం ఆ ప్రచారాలను కొట్టిపారేస్తున్నారు.

Also Read: ఈ అరుదైన రికార్డ్ చంద్రబాబుకే సాధ్యం

ఆముదాలవలసలో పార్టీ బాధ్యతల మార్పు.. నియోజకవర్గ సమావేశానికి తమ్మినేని గైర్హాజరు.. ఆయన కుమారుడి బహిరంగ విమర్శలు.. జిల్లా నాయకత్వంపై ఆరోపణలు.. ఇవన్నీ కలిపి చూస్తే వైసీపీలో తమ్మినేని కుటుంబం రాజకీయ భవిష్యత్తుపై చర్చకు దారితీశాయి. ఇటీవల కాలంలో వైసీపీకి ఉత్తరాంధ్రలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరో సీనియర్ కుటుంబం దూరమైతే దాని ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చ కూడా మొదలైంది. అయితే పార్టీ మార్పుపై తుది నిర్ణయం తమ్మినేని కుటుంబం తీసుకునే వరకు ఇవన్నీ రాజకీయ ఊహాగానాలుగానే చూడాల్సి ఉంటుంది. ఆముదాలవలసలో మొదలైన అసంతృప్తి.. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరం. తమ్మినేని ‘రూటు’ ఎటు అన్నది కాలమే తేల్చాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

కూటమిలో చిచ్చు పెట్టిన...

అధికార కూటమిలో పైకి సమన్వయం కనిపిస్తున్నా.....

పాపం బొత్స.. రాజకీయ...

విజయనగరం జిల్లాలో ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది....

ఈ అరుదైన రికార్డ్...

తిరుమల వేంకటేశ్వరుడు సీఎం చంద్రబాబు ఇష్టదైవం.....

కోర్ట్ లో ఐబొమ్మ...

తెలుగు సినీ పరిశ్రమను వణికించిన ప్రముఖ...

పోల్స్