జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘జై కొట్టు’ యువజన విభాగం ఆవిష్కరణ సభలో పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ యువతలో సరికొత్త రాజకీయ ఉత్తేజాన్ని నింపారు. ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద వైద్య చికిత్స పొందుతున్న కారణంగా ఈ కార్యక్రమానికి ఆయన నేరుగా హాజరుకాలేకపోయినప్పటికీ, పిఠాపురం వేదికగా జరిగిన ఈ సభకు ప్రత్యేకంగా ఒక పవర్‌ఫుల్ ఆడియో సందేశాన్ని పంపించారు. సమాజంలో మార్పు కోసం, యువత భవిష్యత్తు కోసం జనసేన నూతనంగా తీసుకొచ్చిన ఈ వేదిక ద్వారా యువశక్తి అంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read : స్థానిక ఎన్నికల్లో జనసేన మార్క్ వ్యూహం..!
ఈ ఆడియో సందేశంలో పవన్ కల్యాణ్ తన మార్క్ పదునైన వ్యాఖ్యలతో యువతకు దిశానిర్దేశం చేశారు. “మనం ఎవరి దగ్గరా, దేనికోసం చేతులు చాచొద్దు.. దేశం కోసం, సమాజ హితం కోసం నిలబడి పనిచేసే చేతులు మనకు కావాలి. నేను ఎక్కడ ఉన్నాననే ప్రశ్నార్థకం మనకు వద్దు.. నేను ఇక్కడే ఉన్నాననే అస్తిత్వ పిడికిలి కావాలి” అంటూ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా మాట్లాడారు. ఇన్నాళ్లూ కేవలం నాయకుల కోసం, రకరకాల రాజకీయ పార్టీల కోసం జిందాబాద్‌లు కొడుతూ కాలం గడిపామని, కానీ ఇకపై ఆ పరిస్థితి మారాలని జనసేనాని స్పష్టం చేశారు.
Also Read : ఆటోమొబైల్ రంగంలో సంచలనం.. హోండా, నిస్సాన్ భారీ డీల్..!
రాబోయే రోజుల్లో యువత తమ సొంత భవిత కోసం, సమాజంలో రాబోయే గొప్ప మార్పు కోసం, మరియు ప్రజాస్వామ్య తీర్పు కోసం ‘జై కొట్టు’ అంటూ ముందుకు సాగాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. పిఠాపురంలో మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ‘జై కొట్టు’ లోగో ఆవిష్కృతమైన ఈ చారిత్రాత్మక తరుణంలో, పవన్ కల్యాణ్ పంపిన ఆడియో సందేశం రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనసైనికులతో పాటు సోషల్ మీడియాలోనూ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

