ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల రణక్షేత్రం హీటెక్కుతోంది. ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ శ్రేణులతో జరుపుతున్న అంతర్గత సమావేశాల్లో.. “స్థానిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలు కావొద్దు, ప్రతి చోటా పోటీ చేయాల్సిందే” అంటూ పదే పదే దిశా నిర్దేశం చేస్తున్నారు. పైకి ఇది ప్రజాస్వామ్యబద్ధమైన పిలుపులా కనిపిస్తున్నప్పటికీ.. దీని వెనుక కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ఒక పెద్ద వ్యూహాత్మక ప్లాన్ మరియు వైకాపా శ్రేణులను రెచ్చగొట్టే కుట్ర దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Also Read : SC, STలకు జగన్ వెన్నుపోటు..!
ఈ నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైకాపా యొక్క గత ట్రాక్ రికార్డ్‌ను మనం ఒక్కసారి పరిశీలిస్తే.. 2021 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార బలంతో, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఆ పార్టీ ఏ రకమైన అరాచకాలకు పాల్పడిందో స్పష్టంగా అర్థమవుతుంది. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం, బెదిరించడం, భౌతిక దాడులకు పాల్పడటం ద్వారా వందలాది స్థానాలను వైకాపా బలవంతంగా ‘ఏకగ్రీవం’ చేసుకుంది
నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై సైతం జగన్ ప్రభుత్వం ఏ స్థాయిలో కక్షసాధింపు చర్యలకు దిగిందో రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. నామినేషన్ల ప్రక్రియలోనే విపక్షాల గొంతు నొక్కిన చరిత్ర కలిగిన జగన్.. ఇప్పుడు తాము అధికారంలో లేనప్పుడు మాత్రం ఏకగ్రీవాలు వద్దని చెప్పడం వెనుక అసలు రంగు బయటపడుతోంది. జగన్ ఇస్తున్న ఈ తాజా పిలుపు వెనుక రెండు ప్రధాన కుట్రలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also Read : వారసుల కోసం నేతల పాట్లు.. ఫలితమిస్తాయా..?
మొదటిది.. క్షేత్రస్థాయిలో వైకాపా నేతలను, క్యాడర్‌ను రెచ్చగొట్టడం ద్వారా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం. ఎక్కడైనా చిన్న గొడవ జరిగినా దానిని జాతీయ స్థాయిలో “ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం కూలిపోయింది, కక్షసాధింపు రాజకీయాలు సాగుతున్నాయి” అని ప్రచారం చేయడానికి జగన్ సిద్ధమవుతున్నారు. రెండవది.. కూటమిలోని మూడు పార్టీల మధ్య నియోజకవర్గాల వారీగా స్థానిక సీట్ల సర్దుబాటులో చిన్నపాటి అపశృతులు జరిగేలా చూసి, ఆ అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవడం. అందువల్ల, కూటమి ప్రభుత్వం జగన్ పన్నుతున్న ఈ ఉచ్చులో పడకుండా.. వంద శాతం పారదర్శకంగా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలు నిర్వహించి, వైకాపాకు బుద్ధి చెప్పడానికి సిద్ధం కావాలి.

