కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షాల మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వస్తున్నాయా..? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా టీడీపీ సీనియర్లు వర్ల రామయ్య, దళవాయి రమాదేవిని ఎంపిక చేయడం ఇప్పుడు కూటమి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏ నిర్ణయమైనా మిత్రపక్షాలతో చర్చించి, సమష్టిగా తీసుకున్నట్టుగా కనిపించే టీడీపీ.. ఈసారి మాత్రం రెండు ఎమ్మెల్సీ పదవులను తన ఖాతాలో వేసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
Also Read : సాయిరెడ్డి పార్టీ.. వైసీపీలో గుబులు..!
గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు ఎమ్మెల్సీ స్థానాలపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య చర్చ జరిగిందనే ప్రచారం కూడా ఎక్కడా వినిపించలేదు. ముఖ్యంగా బీజేపీకి ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. వైసీపీ నుంచి బీజేపీలో చేరిన ఓ నేతను శాసనమండలికి పంపాలన్న ఆ పార్టీ అధిష్టానం ఆలోచనలో ఉన్నట్టు కూడా సమాచారం. అయితే మిత్రపక్షాలకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఇద్దరు టీడీపీ నేతలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడంతో బీజేపీ వర్గాలు అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తమకు కనీస సంప్రదింపులు లేకపోవడంపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
ఎన్నికల సమయంలో మిత్రపక్షాల అవసరం ఉన్నప్పుడు మాత్రమే పొత్తులను ప్రస్తావించడం.. పదవుల పంపకంలో మాత్రం సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం టీడీపీ వైఖరిగా ఉందన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతుందని రాజకీయ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవుల ఎంపిక ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చిందని ఆయా పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. మిత్రపక్షాల నుంచి ఈ అంశంపై బహిరంగంగా పెద్దగా స్పందన రాకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది. అసంతృప్తి ఉన్నప్పటికీ కూటమి ఐక్యత దెబ్బతినకుండా వ్యవహరిస్తున్నారా..? లేక సమయం కోసం వేచి చూస్తున్నారా..? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
Also Read : గల్ఫ్ దేశాల్లో హై అలెర్ట్.. స్పీడ్ పెంచిన ఇరాన్..!
జనసేనకు ప్రజల్లో బలమైన ఆదరణ ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ బలాన్ని నిరూపించుకోవాలని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల ముసుగులో కొందరు రెచ్చగొట్టేలా వ్యాఖ్యాలు చేస్తున్నారు. అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేసి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని రెచ్చగొడుతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకుండా పోటీ చేసిన జనసేనకు ఎదురైన ఫలితాలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ స్వయంగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ జనసేనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకం, భవిష్యత్ రాజకీయ సమీకరణాలు, 2029లో పవన్ కళ్యాణ్‌ను ముఖ్య మంత్రిని చేయాలన్న జనసేన నేతల వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో అసహనాన్ని పెంచుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన నేతలు, ప్రజాప్రతినిధులు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలను టీడీపీ వర్గాలు ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టే ప్రయత్నంగా భావిస్తున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో అయితే ఈ అసంతృప్తి మరింత బహిర్గతమవుతోంది.
జనసేన సంస్థాగతంగా ఇంకా బలపడాల్సి ఉందంటూ గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పాత వీడియోలను టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. టీడీపీతో పొత్తు లేకుండా పోటీ చేస్తే జనసేనకు ఎదురయ్యే పరిస్థితులపై అప్పట్లో పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రశ్నిస్తున్నారు. ‘పొత్తులో ఉన్నాం కాబట్టి సంయమనం పాటిస్తున్నాం.. దాన్ని అసమర్థతగా భావించొద్దు’ అంటూ కొందరు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. జనసేనలో బొలిశెట్టి శ్రీనివాస్, పంతం నానాజీ వంటి నేతల వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
Also Read : టాలీవుడ్ కు షాక్ ఇచ్చిన తెలంగాణా సర్కార్..!
ఇప్పటికే కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలు పెరుగుతున్నాయి. కూటమి నేతలు, కార్యకర్తలు ఒకరినొకరు తిట్టుకోవద్దని, విమర్శలు చేయవద్దని సమిష్టిగా పిలుపును ఇచ్చినప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఒకవైపు పదవుల పంపకంలో అసంతృప్తి.. మరోవైపు స్థానిక ఎన్నికల సీట్లపై పోటీ.. ఇంకోవైపు 2029 ముఖ్యమంత్రి అంశంపై జనసేనలో పెరుగుతున్న చర్చ.. ఇవన్నీ కలిసి కూటమిలో అంతర్గతంగా ఉన్న అసహనాన్ని బయటకు తెస్తున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికతో మొదలైన ఈ చర్చ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎటువైపు దారితీస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

