ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సరికొత్త పచ్చని సంకల్పాన్ని చేపట్టింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆదేశాలతో పరిశ్రమల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొదటి దశ కింద 26 ప్రధాన పరిశ్రమలలో 14 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ విజయవంతంగా అమలు చేస్తున్నారు. పారిశ్రామిక పరిసర ప్రాంతాలలో కాలుష్య నియంత్రణతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటమే లక్ష్యంగా ఈ డ్రైవ్‌ను ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తోంది.
Also Read : భారత్ ఘన విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక పరిస్థితి ఏంటీ..?
పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం మేరకు ప్రతి పారిశ్రామిక ప్రాంగణంలోనూ కచ్చితంగా 33 శాతం మేర గ్రీన్ కవర్ ఉండేలా కట్టుదిట్టమైన ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే మొదటి విడత డ్రైవ్‌లో పారిశ్రామిక వర్గాలు పెద్ద ఎత్తున స్పందించి, ఏకంగా 129 ఎకరాల విస్తీర్ణంలో 43,300 మొక్కలను నాటాయి. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటి సంరక్షణ బాధ్యతలను కూడా సదరు పరిశ్రమల యాజమాన్యాలే చూసుకునేలా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. మొదటి దశ సాధించిన విజయంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగిలిన అన్ని చిన్న, పెద్ద పరిశ్రమలలో కూడా ఈ గ్రీన్ కవర్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.
Also Read : ‘రాజకీయ మౌనం’ వెనుక అసలు వ్యూహం ఇదేనా..!
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పర్యావరణ రంగంలో ఒక దీర్ఘకాలికమైన చారిత్రాత్మక మైలురాయిని నిర్దేశించుకుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి, అంటే 2047 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 50 శాతం మేర గ్రీన్ కవర్ సాధించడమే అంతిమ లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత, పరిశుభ్రమైన ఏపీని అందించడానికి పరిశ్రమలు, అడవులు మరియు సామాజిక వనాలతో కూడిన ఈ సమగ్ర పచ్చదనాల ప్రణాళిక ఎంతో దోహదపడనుందని పారిశ్రామిక, పర్యావరణ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

