టాటా గ్రూప్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దాదాపు పదేళ్లుగా టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్న ఎన్.చంద్రశేఖరన్ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత మరోసారి చైర్మన్‌గా నియమితులు కావడానికి తాను ముందుకు రానని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. చంద్రశేఖరన్ రాజీనామా వెనుక అసలు కారణాలేంటి? ముఖ్యంగా టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయల్ టాటాతో ఏర్పడిన విభేదాలే ఈ పరిణామానికి దారితీశాయా? అనే చర్చ ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఫిబ్రవరి సమావేశమే కీలక మలుపు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. చంద్రశేఖరన్ తన రాజీనామా ప్రకటనలో కీలక విషయాలను వెల్లడించారు. 2025 సెప్టెంబర్‌లో టాటా ట్రస్ట్స్, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ, టాటా సన్స్ బోర్డు.. చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పదవీకాలం ఇవ్వాలని సిఫారసు చేశాయి. అయితే 2026 ఫిబ్రవరి 24న ఈ ప్రతిపాదనను బోర్డు ముందుకు తీసుకువచ్చినప్పుడు ఒక బోర్డు సభ్యుడు దానికి మద్దతు ఇవ్వలేదు. ఏకగ్రీవ మద్దతు లభించకపోవడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు చంద్రశేఖరన్ తెలిపారు.
Also Read : రాజకీయాల్లోకి జగన్ వారసురాలు.. డేట్, ప్లేస్ ఫిక్స్..!
ఆ తర్వాత దాదాపు ఆరు నెలలు గడిచినా ఈ అంశంపై ఎలాంటి తుది నిర్ణయం రాలేదు. దీంతో టాటా సన్స్ వంటి భారీ సంస్థకు 2027 తర్వాత నాయకత్వంపై స్పష్టత అవసరమని చంద్రశేఖరన్ భావించారు. ఉద్యోగులు, పెట్టుబడిదారులు, భాగస్వాములు, ఇతర స్టేక్ హోల్డర్లలో అనిశ్చితి లేకుండా ముందుగానే వారసత్వ ప్రక్రియను ప్రారంభించాలని బోర్డును కోరారు. చంద్రశేఖరన్ కొనసాగింపుపై నోయల్ టాటా అభ్యంతరాలు ఎందుకు.. అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఫిబ్రవరి బోర్డు సమావేశంలో నోయల్ టాటా.. గ్రూప్‌లోని కొన్ని కొత్త వ్యాపారాల నష్టాలు, భారీ పెట్టుబడులు, బలహీన ఆర్థిక ఫలితాలపై ప్రశ్నలు లేవనెత్తినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఏవియేషన్, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఈ-కామర్స్ వంటి కొత్త రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం, వాటి లాభదాయకతపై చర్చ జరిగినట్లు సమాచారం.
ఇదే సమయంలో చంద్రశేఖరన్ పదవీకాల పొడిగింపుపై కూడా విభేదాలు బయటపడ్డాయి. నివేదికల ప్రకారం నోయల్ టాటా మరోసారి చంద్రశేఖరన్‌ను చైర్మన్ గా కొనసాగించేందుకు కొన్ని షరతులు పెట్టినట్లు సమాచారం. టాటా సన్స్ ను లిస్టింగ్ చేయకూడదన్న అంశం కూడా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ షరతులపై చంద్రశేఖరన్ వ్యక్తిగతంగా అంగీకరించలేదని తెలిసింది. దీంతో వీరి మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం సాగుతోంది. టాటా సన్స్ – టాటా ట్రస్ట్స్ మధ్య విభేదాలు కూడా చంద్రశేఖరన్ రాజీనామాకు ఓ కారణంగా భావిస్తున్నారు.
Also Read : సరికొత్త మహీంద్రా థార్ 3-డోర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అప్పుడే..!
టాటా సన్స్ గ్రూప్‌లో టాటా ట్రస్ట్‌కు సుమారు 66 శాతం వాటా ఉంది. దీంతో గ్రూప్ పాలన, వ్యూహాలు, బోర్డు ప్రాతినిధ్యం వంటి అంశాల్లో ట్రస్ట్స్‌కు గణనీయమైన ప్రభావం ఉంటుంది. కొంతకాలంగా టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య బోర్డు ప్రాతినిధ్యం, గ్రూప్ వ్యూహం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వాటా వంటి అంశాలపై విభేదాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రశేఖరన్ పదవీకాల పొడిగింపుపై ఏకాభిప్రాయం రాకపోవడం టాటా గ్రూప్‌లో నాయకత్వ మార్పుపై అనిశ్చితి పెంచింది. చివరకు ఈ పరిస్థితుల్లో మరోసారి తనను పరిగణనలోకి తీసుకోవద్దని చంద్రశేఖరన్ నిర్ణయించుకున్నారు.
చంద్రశేఖరన్ నిర్ణయాన్ని పూర్తిస్థాయి తక్షణ రాజీనామాగా చూడటం కంటే 2027 ఫిబ్రవరిలో తన ప్రస్తుత పదవీకాలం ముగిసేలోపు వారసుడిని ఎంపిక చేసేందుకు మార్గం సుగమం చేయడంగా మార్కెట్ వర్గాలు చూస్తున్నాయి. టాటా సన్స్ బోర్డు త్వరగా వారసత్వ ప్రక్రియను ప్రారంభించాలని చంద్రశేఖరన్ కోరారు. మొత్తంగా చూస్తే చంద్రశేఖరన్ రాజీనామా వెనుక ప్రధాన కారణం.. ఆయన పదవీకాల పొడిగింపుపై బోర్డులో ఏకాభిప్రాయం రాకపోవడమే అంటున్నారు. అదే సమయంలో నోయల్ టాటాతో ఏర్పడిన విభేదాలు, గ్రూప్‌లోని కొన్ని నష్టాలపై ఆందోళనలు, టాటా సన్స్ భవిష్యత్ వ్యూహాలపై భిన్నాభిప్రాయాలు ఈ పరిణామానికి నేపథ్యంగా కనిపిస్తున్నాయి. అయితే ‘నోయల్ టాటాతో వ్యక్తిగత విభేదాలే రాజీనామాకు ఏకైక కారణం’ అని బిజినెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

