రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికర చర్చకు కారణమైన అంశం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఆర్థిక శాఖ శ్వేతపత్రం. పైకి చూస్తే అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక మాత్రమే. కానీ రాజకీయ కోణంలో చూస్తే.. అది ఉద్యోగ సంఘాలకు పంపిన స్పష్టమైన సంకేతమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి శాఖపై శ్వేతపత్రాలు విడుదల చేసింది.
Also Read : ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఎవరూ..?
వైసీపీ హయాంలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చంద్రబాబు పదేపదే వివరించారు. సంపద సృష్టించి ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి రెండేళ్ల పాలన పూర్తవ్వడానికి నాలుగు నెలలే మిగిలి ఉన్నాయి. కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన ప్రధాన ఆర్థిక హామీలు ఇప్పటికీ అమలు కాలేదనే అసంతృప్తి తీవ్రంగా ఉంది. పీఆర్సీ, డీఏ బకాయిలు, ఐఆర్, పెండింగ్ బిల్లులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి గడువు విధించాయి. స్పందన లేకుంటే ఈ నెల 13న ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించాయి.
ఉపాధ్యాయ సంఘాలు కూడా ఫ్యాప్టో వేదికగా ఏకమై తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది… ఇలా దాదాపు ప్రతి ఉద్యోగ వర్గం తమ హామీలు అమలు చేయాలని ఒత్తిడి పెంచుతోంది. ప్రభుత్వం మాత్రం చర్చలు జరుపుతున్నప్పటికీ, స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ఉద్యోగుల డిమాండ్ల పై నేరుగా స్పందించకపోయినా.. తన వైఖరిని గణాంకాల ద్వారా స్పష్టంగా వెల్లడించారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Also Read : వెంటాడుతున్న ED.. వేల కోట్ల స్కామ్‌లో వైసీపీ సీనియర్ నేత
“రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 96 శాతం జీతాలు, పెన్షన్లకే వెళ్తుంది” అని చంద్రబాబు వివరించారు. అంతేకాదు. 2014-15 నుంచి 2018-19 వరకు రాష్ట్ర ఆదాయంలో మానవ వనరుల వ్యయం సగటున 87 శాతం ఉండగా.. 2019-20 నుంచి 2023-24 మధ్య అది 110 శాతానికి చేరిందని, మితిమీరిన నియామకాల వల్లే ఈ భారం పెరిగిందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం గణాంకాలు మాత్రమే కాదు.. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన రాజకీయ సందేశంగా కూడా చాలామంది చూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత క్లిష్టంగా ఉన్నప్పుడు.. మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు ఎలా కల్పించాలన్న ప్రశ్నను ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అంతేకాదు.. ఉద్యోగులు ఉద్యమ బాట పట్టినా, వారి డిమాండ్లను ప్రజలు పూర్తిగా సమర్థించే పరిస్థితి లేకుండా ముందుగానే వాతావరణాన్ని సిద్ధం చేస్తున్నారనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. “జీతాలు, పెన్షన్లకే దాదాపు మొత్తం ఆదాయం ఖర్చవుతోంది. మరి అభివృద్ధి, సంక్షేమానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి?” అనే చర్చను ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోందన్న భావన వ్యక్తమవుతోంది. అయితే మరోవైపు.. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం.. రెండేళ్లు పూర్తవుతున్నా కీలక హామీలను ఎందుకు అమలు చేయలేదని నిలదీస్తున్నాయి.
Also Read : చంద్రబాబు మార్క్ రాజకీయం.. ఆ నేతకు బ్రేక్..!
ఇప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయుల ముందున్న పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. ప్రభుత్వం చెబుతున్న ఆర్థిక ఇబ్బందులను అంగీకరించి తమ డిమాండ్లను తాత్కాలికంగా పక్కన పెడతారా? లేక హామీల అమలుకోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి.. చంద్రబాబు శ్వేతపత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించడానికే పరిమితం కాలేదు. ఉద్యోగ సంఘాలపై రాజకీయ, మానసిక ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగమనే చర్చకు కూడా తెర తీసింది. ఇక ఉద్యోగులే తేల్చుకోవాలి.

