Sunday, July 26, 2026 12:00 AM
Sunday, July 26, 2026 12:00 AM

ఎన్టీఆర్ బాటలోనే చంద్రబాబు.. మరో సంస్కరణ..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలకమైన మార్పునకు రంగం సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల్లో ఎన్నో ఏళ్లుగా వివాదాలకు, ఫిరాయింపులకు, క్యాంప్ రాజకీయాలకు, కోట్ల రూపాయల బేరసారాలకు కేంద్రంగా మారిన పరోక్ష ఎన్నికల విధానానికి స్వస్తి పలికే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులను ప్రజలే నేరుగా ఎన్నుకునే ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రజా తీర్పు వక్రీకరించే రాజకీయాలకు ముగింపు పలకడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

Also Read : టీడీపీకి బోండా ఉమా గుడ్‌బై..?

ప్రస్తుతం అమలులో ఉన్న పరోక్ష ఎన్నికల విధానంలో ముందుగా వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలు ఎన్నికవుతారు. అనంతరం వారే మేయర్, చైర్మన్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఈ దశలోనే అధికార బలం, ధనబలం, రాజకీయ ఒత్తిళ్లు రంగంలోకి దిగుతాయి. మెజార్టీ లేకున్నా ప్రత్యర్థి పార్టీల సభ్యులను రిసార్టులకు తరలించడం, క్యాంపులు నిర్వహించడం, ప్రలోభాలు, బెదిరింపులతో తమ వైపు తిప్పుకోవడం వంటి పరిణామాలు తరచూ కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రజలు ఒక పార్టీకి మెజార్టీ ఇచ్చినా, అధికార పీఠంపై మరో పార్టీ కూర్చునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రజాస్వామ్య విరుద్ధ ధోరణికి ముగింపు పలకడానికే ప్రత్యక్ష ఎన్నికల విధానం సరైన పరిష్కారమని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : సీమకు మరో బంపర్ ఆఫర్..!

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు పరోక్ష ఎన్నికల విధానాన్నే కొనసాగించాలని కోరుకుంటాయి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో పూర్తి మెజార్టీ లేకపోయినా, ఎన్నికైన సభ్యులను తమ వైపు తిప్పుకుని అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి, ప్రజల ప్రత్యక్ష తీర్పుకే ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచించడం విశేషంగా మారింది. స్థానిక సంస్థల్లో కోట్ల రూపాయల బేరసారాలు, రాజకీయ వ్యాపారానికి అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 243C, 243R ప్రకారం స్థానిక సంస్థల అధ్యక్షుల ఎన్నికల విధానాన్ని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది. దీని కోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీస్ చట్టం-1965. మున్సివల్ కార్పొరేషన్ల చట్టం-1994లో సవరణలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీలో కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఈ చట్టసవరణ పెద్ద సమస్య కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read : కాక్రోచ్ డిమాండ్.. అంతటితో ఆగుతుందా..?

ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లోకి వస్తే స్థానిక రాజకీయాల స్వరూపమే మారే అవకాశం ఉంది. కౌన్సిలర్లు. ఎంపీటీసీలను కొనుగోలు చేసి అధికారాన్ని దక్కించుకునే రాజకీయాలకు తెరపడుతుంది. ప్రజల్లో ఆదరణ, నాయకత్వ సామర్థ్యం ఉన్న అభ్యర్థులకే పార్టీలు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. ప్రజల చేత నేరుగా ఎన్నికైన నాయకులు ప్రజలకే ఎక్కువ జవాబుదారులుగా ఉండాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నప్పటికీ రాజకీయ లబ్ధిని పక్కనబెట్టి ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రయత్నంగా ఈ నిర్ణయం నిలిస్తే, స్థానిక పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు కొత్త అంశం కాదు. 1987లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తొలిసారిగా మున్సిపల్ చైర్మన్లు. మండల ప్రజాపరిషత్ అధ్యక్షులను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానాన్ని తీసుకొచ్చారు. అనంతరం చంద్రబాబు నాయుడు హయాంలో కూడా మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు. అయితే కౌన్సిల్‌లో ఒక పార్టీకి మెజార్టీ, మేయర్ లేదా చైర్మన్ మరో పార్టీకి చెందిన వారు కావడంతో పాలనలో ప్రతిష్టంభనలు ఏర్పడుతున్నాయనే కారణంతో తర్వాతి ప్రభుత్వాలు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానానికే మొగ్గు చూపాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమెరికా గ్లోబల్ వీసా...

ప్రపంచంలో ఏ మూల కూర్చుని అమెరికా...

టీడీపీకి బోండా ఉమా...

ఏపీ రాజకీయాల్లో పసుపు జెండాను వీడి...

బ్రేకింగ్: ధర్మేంద్ర ప్రధాన్...

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్...

సీమకు మరో బంపర్...

రాయలసీమకు కూటమి ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్...

కోడలిపై జోగి రమేష్‌...

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి...

అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా...

పోల్స్