గర్భధారణ సమయంలో జ్వరం లేదా నొప్పుల కోసం పారాసిటమాల్ మాత్రలు వాడటం వల్ల పుట్టబోయే పిల్లల్లో ఆటిజం లేదా ఎడిహెచ్‌డి లాంటి నరాల సంబంధిత లోపాలు వచ్చే ప్రమాదం ఉందంటూ గత కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రచారానికి అంతర్జాతీయ వైద్య పరిశోధకులు తెరదించారు. ప్రసిద్ధ జర్నల్ జామా ఇంటర్నల్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక సరికొత్త మరియు అతిపెద్ద అధ్యయనం ప్రకారం.. గర్భిణీలు పారాసిటమాల్ వాడటానికి, పిల్లల్లో ఆటిజం లేదా ఎడిహెచ్‌డి రావడానికి ఎలాంటి సంబంధం లేదని శాస్త్రీయంగా రుజువైంది.
Also Read : వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ఈ పరిశోధన కోసం హాంకాంగ్ కు చెందిన సుమారు 7 లక్షల మందికి పైగా తల్లులు మరియు వారి పిల్లల గత రెండు దశాబ్దాల ఆరోగ్య రికార్డులను నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల్లో.. ఒకరు కడుపులో ఉన్నప్పుడు పారాసిటమాల్ వాడి, మరొకరి సమయంలో వాడకపోవడం అనే అత్యంత నమ్మకమైన పద్ధతి ద్వారా ఈ డేటాను విశ్లేషించారు. గర్భధారణలో ఏ నెలలో వాడినా, ఎంత మోతాదులో వాడినా కూడా పిల్లల్లో ఆటిజం ముప్పు పెరగలేదని ఈ అధ్యయనంలో తేలింది.
Also Read : కవిత కొత్త పార్టీకి ఈసీ షాక్..!
గతంలో వచ్చిన కొన్ని అధ్యయనాలు పారాసిటమాల్ వల్ల ముప్పు ఉందని చెప్పినప్పటికీ.. అవి కుటుంబ జన్యువులు, గర్భిణీలకు ఉన్న ఇతర ఇన్ఫెక్షన్లు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోలేదని తాజా పరిశోధన స్పష్టం చేసింది. గర్భధారణ సమయంలో తీవ్రమైన జ్వరాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల తల్లికి, కడుపులోని బిడ్డకు ఎక్కువ ముప్పు ఉంటుందని, కాబట్టి డాక్టర్ల సలహా మేరకు అవసరమైనప్పుడు పారాసిటమాల్ ను కనీస మోతాదులో, తక్కువ రోజులు వాడుకోవడం సురక్షితమేనని నిపుణులు పునరుద్ఘాటించారు.

