తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో జరుగుతున్న అరాచకాలు కలకలం రేపుతున్నాయి. రాజకీయ అండదండలతో కొందరు వడ్డీ వ్యాపారులు సామాన్యులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, వైఎస్సార్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి అనుచరులు వడ్డీల పేరుతో చెలరేగిపోతున్నట్లు నగరంలో చర్చ నడుస్తోంది. అవసరాలకు వడ్డీలకు తీసుకునే వారిని వేధిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి.
Also Read : మరో రెండు ముక్కలవుతున్న శివసేన..!
నూటికి ఏకంగా రూ.10 వడ్డీ వసూలు చేస్తూ బాధితుల రక్తాన్ని పిండుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భూమన అభినయ్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా చెప్పుకునే చైతన్య యాదవ్ వేధింపులు తట్టుకోలేక అరుణ్ కుమార్ అనే బాధితుడు బహిరంగంగా తన ఆవేదనను పంచుకున్నాడు. గతంలో తన అవసరాల నిమిత్తం చైతన్య యాదవ్ వద్ద అరుణ్ కుమార్ రూ.4.5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.
Also Read : ప్రోటీన్ పౌడర్లు మీ కాలేయాన్ని దెబ్బతీస్తున్నాయా..?
దీనికి సంబంధించి ఇప్పటికే అసలు కంటే అదనంగా భారీ మొత్తంలో వడ్డీని చెల్లించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. అయినప్పటికీ చైతన్య యాదవ్ ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాడని, మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడని అరుణ్ కుమార్ ఆరోపించాడు. చైతన్య యాదవ్ నుంచి తనకు మరియు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధితుడు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశాడు. ఈ అక్రమ వడ్డీ మాఫియా అరాచకాలపై ఉన్నతాధికారులు స్పందించి, తనకు న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని బాధితుడు కోరుతున్నాడు.

