భారత అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఒక చారిత్రాత్మకమైన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. సుదీర్ఘ కాలంగా చర్చల దశలోనే ఉండిపోయిన భారత్-బ్రిటన్ ఉచిత వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. ఈ ఒప్పందం అమలుకు చివరి నిమిషంలో ఎదురైన బ్రిటన్ సరికొత్త ఉక్కు సుంకాల అడ్డంకులను భారత్ విజయవంతంగా అధిగమించింది. మన దేశ ఆందోళనలను బ్రిటన్ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించడంతో, వచ్చే నెల నుంచే ఈ ప్రతిష్టాత్మక ట్రేడ్ డీల్ రెండు దేశాల్లోనూ పూర్తి స్థాయిలో అమలులోకి రాబోతోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Also Read : బ్రేకింగ్: లోకేష్ సంచలన నిర్ణయాలు..!
ఈ ఉచిత వాణిజ్య ఒప్పందం వల్ల భారత్ లో నివసించే వినియోగదారులకు, ముఖ్యంగా వ్యాపారవేత్తలకు భారీ లాభం చేకూరనుంది. బ్రిటన్ నుంచి భారత్ కు దిగుమతి అయ్యే చాలా రకాల వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ భారీగా తగ్గనున్నాయి. మన దేశ మార్కెట్లలో బ్రిటన్ నుంచి వచ్చే ప్రపంచ ప్రసిద్ధ స్కాచ్ విస్కీ, వైన్లతో పాటు లగ్జరీ బ్రిటిష్ కార్లు, వాటి ఆటోమొబైల్ విడిభాగాలు తక్కువ ధరలకే లభించే అవకాశం ఉంది. వీటితో పాటు బ్రిటన్ నుంచి వచ్చే అత్యాధునిక వైద్య పరికరాలు, జీవశాస్త్ర ఆధారిత మందులు, ప్రీమియం చాక్లెట్లు మరియు ప్యాకేజ్డ్ ఫుడ్స్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి.
Also Read : రెండు పార్టీల్లో “సర్” భయం..!
మరోవైపు, ఈ డీల్ వల్ల బ్రిటన్ వస్తువుల ధరలు తగ్గడమే కాకుండా మన దేశం నుంచి బ్రిటన్ కు జరిగే ఎగుమతులు కూడా విపరీతంగా పెరుగుతాయి. భారత దుస్తులు, చేనేత వస్తువులు, రత్నాలు, ఆభరణాల ఎగుమతులపై బ్రిటన్ సుంకాలను పూర్తిగా తొలగించడం వల్ల మన దేశ టెక్స్ టైల్ రంగానికి భారీగా ఆర్డర్లు వస్తాయి, ఇది దేశంలో లక్షలాది మందికి కొత్త ఉపాధిని ఇస్తుంది. దీనితో పాటు మన దేశ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, అకౌంటెంట్లు, ఐటీ నిపుణులు బ్రిటన్ వీసాలను సులభంగా పొందేలా నిబంధనలను సరళీకరించారు. దీర్ఘకాలంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విపరీతంగా పెంచేందుకు, చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చేందుకు ఈ ఒప్పందం ఎంతో సహాయపడుతుంది.

