జాతీయ జట్టులో అవకాశం దక్కాలి అంటే..? ఒకప్పుడు రంజీ ట్రోఫీలో బాగా ఆడాలి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఐపిఎల్ లో బాగా ఆడాలి. అలా ఆడితేనే క్లిక్ అవుతారు. కెప్టెన్ లు కూడా అవుతున్నారు. మరి ఇలా ఆడి.. ఓ జట్టుకు కప్ కూడా గెలిపించి ఇచ్చిన.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కు మాత్రం నిరాశే ఎదురవుతోంది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు.
Also Read : కష్టపడిన వారికి గుర్తింపు కష్టమేనా..?
మంగళవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ తో జరిగిన కీలకమైన ప్లేఆఫ్ మ్యాచ్ లో కేవలం 33 బంతుల్లోనే 9 సిక్సర్లు, 5 ఫోర్లతో ఏకంగా 93 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పాటిదార్ పవర్ షో కారణంగా ఆర్సీబీ ఐపీఎల్ ప్లే ఆఫ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసి, ఫైనల్ కు దూసుకెళ్లింది. రజత్ పాటిదార్ కేవలం నిన్నటి మ్యాచ్ లోనే కాదు, గత ఏడాదిగా నిలకడగా రాణించాడు. ఫాఫ్ డుప్లెసిస్ తర్వాతలో ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టిన పాటిదార్.. తన అద్భుత కెప్టెన్సీతో జట్టుకు ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలి ఐపీఎల్ టైటిల్ అందించాడు.
ఇక ఈ 2026 సీజన్‌లో కూడా జట్టును ముందుండి నడిపిస్తూ, ఒక టీ20 టోర్నీలో అత్యధిక సిక్సర్లు.. ఏకంగా 41 సిక్సర్లు బాదిన కెప్టెన్ గా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల తర్వాత వరుసగా రెండుసార్లు జట్టును ఫైనల్ కు చేర్చిన ఐదో కెప్టెన్ గా నిలిచాడు. గత ఏడాది ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతో పాటు, ఈ ఏడాది కూడా మిడిల్ ఓవర్లలో 200 పైగా స్ట్రైక్ రేట్ తో మెరుపులు మెరిపిస్తున్నా.. పాటిదార్ కు భారత జాతీయ జట్టులో తగిన అవకాశాలు రాకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
Also Read : అధికారం కోసం విధ్వంసం.. గులాబీ నేత అసలు రూపం..!
2023లో వన్డేల్లో, 2024లో టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటికీ.. కొన్ని మ్యాచ్ ల వైఫల్యాల తర్వాత అతడిని పక్కన పెట్టేశారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో అతడికి ఉన్న అద్భుతమైన హిట్టింగ్ నైపుణ్యాలను సెలెక్టర్లు గుర్తించకపోవడంపై క్రీడా విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి మ్యాచ్ లో కగిసో రబడా బౌలింగ్ లో పాటిదార్ కొట్టిన క్లాసిక్ సిక్సర్ కు విరాట్ కోహ్లీ సైతం నోరెళ్లబెట్టాడు. ఇంతటి అంతర్జాతీయ స్థాయి నాణ్యత, ఒత్తిడిని తట్టుకునే మానసిక దృఢత్వం ఉన్న ఆటగాడిని టీమిండియా మేనేజ్మెంట్ ఎందుకు విస్మరిస్తోందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

