హైదరాబాద్ లోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ దేవాలయం అంతర్జాతీయ రాజకీయ వివాదానికి కేంద్రబిందువైంది. అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ఎరిక్ స్మిత్ సోషల్ మీడియా వేదికగా ఈ పవిత్ర క్షేత్రాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ నుండి అమెరికా వెళ్లే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు నమ్మకంతో దర్శించుకునే ఈ వీసా గాడ్ ఆలయాన్ని ఆయన ఒక గ్లోబల్ వీసా కార్టెల్ అంటే.. వీసా మాఫియా నెట్వర్క్ గా అభివర్ణించడం తీవ్ర దుమారం రేపింది.
Also Read : ఎస్ఐఆర్ మూడో దశ.. తెలుగు రాష్ట్రాల్లో పరిశీలన..!
అమెరికా వీసా విధానం వల్ల అక్కడి స్థానిక కార్మికులు నష్టపోతున్నారంటూ సెనేటర్ ఎరిక్ స్మిత్ సుదీర్ఘమైన పోస్ట్ లు పెట్టాడు. ఈ క్రమంలో వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఒక పాత కథనాన్ని ప్రస్తావిస్తూ ఆలయ ఫోటోను షేర్ చేశాడు. వేలాది మంది భారతీయులు తమ పాస్ పోర్టులను పట్టుకుని వీసాల కోసం ఇక్కడ ప్రదక్షిణలు చేస్తున్నారని, ఇంతలా మేనేజ్ చేయబడుతున్న వ్యవస్థతో అమెరికా కార్మికులు పోటీ పడాల్సి రావడం దురదృష్టకరమని ఆయన ఆరోపించాడు.
Also Read : మరో మాట నిలబెట్టుకున్న నారా లోకేష్..!
అయితే, దాదాపు 500 సంవత్సరాల ఘనమైన చరిత్ర గల చిల్కూరు ఆలయ విశిష్టతను ఆయనకు తెలియదు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఉస్మాన్ సాగర్ ఒడ్డున వెలసిన ఈ క్షేత్రంలో ఎలాంటి హుండీ ఉండదు, విరాళాలు తీసుకోరు, కనీసం వీఐపీ క్యూ లైన్లు కూడా ఉండవు. 1980-90ల కాలంలో కొందరు ఐటీ నిపుణులు ఇక్కడ 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకోగా వీసాలు రావడం, ఆ తర్వాత కృతజ్ఞతగా 108 ప్రదక్షిణలు చేయడంతో ఇది భక్తుల నమ్మకంగా మారింది. ఇది పూర్తిగా కోట్ల మంది భక్తుల సెంటిమెంట్, దైవ భక్తికి సంబంధించిన విషయమే తప్ప ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని భక్తులు అంటున్నారు. సెనేటర్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు తీవ్రంగా మండిపడుతున్నారు. వీసాలు ఇచ్చేది అమెరికా ఎంబసీ అధికారులు కానీ, గుడి కాదు అని కౌంటర్ లు ఇస్తున్నారు.

