తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ప్రారంభ రౌండ్లలో కనిపించిన రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతూ, తాజా ట్రెండ్స్ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపులకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే (TVK) పార్టీ అద్భుత ప్రదర్శనతో ముందంజలో నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రారంభ అంచనాలను తారుమారు చేస్తూ ఈ కొత్త పార్టీ అనేక నియోజకవర్గాల్లో గట్టి ఆధిక్యం సాధిస్తోంది.
Also Read : తమిళనాట రాజకీయ సంచలనానికి తెరలేపిన టీవీకే విజయ్..!
మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో, ఇప్పటివరకు ఎక్కువ శాతం స్థానాల ఫలితాలు వెలువడగా, టీవీకే పార్టీ ప్రధాన ప్రత్యర్థులైన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన ఈ రెండు ప్రధాన పార్టీలకు ఇది గట్టి సవాలుగా మారింది. ఓటర్లలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం పట్ల పెరుగుతున్న ఆసక్తి ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
అధికార డీఎంకే పార్టీ తొలి రౌండ్లలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, తరువాతి దశల్లో అనూహ్యంగా వెనుకబడింది. మరోవైపు, ఏఐఏడీఎంకే ప్రారంభంలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ, క్రమంగా పుంజుకుని కొన్ని ప్రాంతాల్లో పోటీని మరింత రసవత్తరంగా మార్చింది. ఈ పరిణామాలు ఎన్నికల ఫలితాలను చివరి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగించేలా చేస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే, విజయ్ పోటీ చేసిన ప్రాంతాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. తిరుచ్చి ఈస్ట్‌లో కొంత వెనుకంజలో ఉన్నప్పటికీ, పెరంబూర్‌లో మాత్రం ఆయన భారీ మెజారిటీతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇది ఆయన వ్యక్తిగత ప్రజాదరణతో పాటు పార్టీ పెరుగుతున్న ప్రభావాన్ని ప్రతిబింబిస్తోంది.
Also Read : కేరళ సీఎం అయ్యేది ఎవరు..? శశి థరూర్ కష్టమేనా..?
ప్రస్తుతం స్పష్టమైన మెజారిటీ దిశగా ఏ పార్టీ కూడా పూర్తిగా ముందుకు రాకపోవడంతో, ప్రభుత్వం ఏర్పాటు పై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మద్దతు పొత్తుల అవకాశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా టీవీకే పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్డీఏ తరుపున నటి ఖుష్బూ సుందర్ టీవీకే పార్టీ అధినేత విజయ్ కి పరోక్షంగా స్నేహ హస్తం అందించిన సంగతి తెలిసిందే. విజయ్ కావాలనుకుంటే ఇప్పటికైనా ఎన్డీయే లో చేరవచ్చని.. అందుకోసం తలుపులు తెలిచే ఉన్నాయని పేర్కొన్నారు. మరి విజయ్ బిజెపి కూటమికి మద్దతిస్తారో లేక బిజెపి కూటమి విజయ్ కి మద్దతిచ్చి అధికారంలో చేరుతుందో చూడాలి.

