తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరపతి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వద్ద బాగా పెరిగింది. ఆయన ప్రతిపాదనలకు హై కమాండ్ వద్ద ఎనలేని ప్రాధాన్యం లభిస్తోంది. మరోవైపు పార్టీ పెద్దలు కూడా రేవంత్ రెడ్డికి విపరీతమైన స్వేచ్ఛ ఇస్తున్నారు. ఒకవేళ కేరళలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే రేవంత్ గ్రాఫ్ కాంగ్రెస్ పార్టీలో ఆకాశాన్ని తాకుతుంది కూడా. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ పార్టీ అనేక రకాల అభ్యంతరాలు తెలుపుతోంది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ అంశంపై రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ఇప్పుడు హైలెట్ అవుతోంది. జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు పలు కీలక ప్రతిపాదనలతో ఢిల్లీలో అడుగుపెట్టారు రేవంత్. దీంతో అందరి చూపు ఆయనపై పడింది.
Also Read ; డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుకు షాక్..!
కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ తరుణంలో తెలంగాణ సీఎం రేవంత్ హైబ్రిడ్ మోడల్‌తో ఢిల్లీ వెళ్లారు. తన ప్రతిపాదనపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని అడ్డుకుంటూనే.. ఉత్తరాది ప్రయోజనాలను కాపాడేలా ఈ మోడల్ ఉండబోతోందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రేవంత్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక జాతీయ విధానంగా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మహిళా రిజర్వేషన్ల బిల్లును డిలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని ఇప్పటికే ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మహిళా రిజర్వేషన్లకు తాము సుముఖమేనని.. అయితే డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కడం సరికాదని ఆ కూటమి నేతలు వాదిస్తున్నారు. ముఖ్యంగా జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు.. కేవలం జనాభా తక్కువగా ఉందన్న కారణంతో పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని కోల్పోవాల్సి రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు వంటి రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యం తగ్గిపోతుందని.. దీనిని అనుమతించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. అవసరం అనుకుంటే తమిళనాడును దిగ్బంధిస్తామని హెచ్చరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి గట్టి సంకేతాలు పంపారు. స్టాలిన్ లాంటి నేతల తీవ్ర నిరసనలు.. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌తో ఇండియా కూటమి పట్టు బిగిస్తోంది.
Also Read ; బ్రేకింగ్: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్
అయితే ఇప్పటివరకు జాతీయ అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పై చేయి సాధించడం లేదు. కానీ ఇప్పుడు రేవంత్ హైబ్రిడ్ మోడల్‌ను జాతీయ స్థాయిలో ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఈ వివాదంలో పరిష్కారం చూపుతున్న పార్టీగా నిలబెట్టే అవకాశం ఉంది. అటు మహిళా బిల్లుకు మద్దతు ఇస్తూనే.. ఇటు దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతున్నామనే సందేశాన్ని ప్రజలకు పంపించడం కోసమే రేవంత్ ఇలా వ్యవహరిస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. మొత్తానికి ఇప్పుడు జాతీయ స్థాయిలో సైతం తెలంగాణ సీఎం రేవంత్ పరపతి అమాంతం పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

