నియోజకవర్గాల పెంపు, పునర్విభజన దాదాపు ఖాయమై పోయింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య 175 నుంచి 263కి, లోక్‌సభ సభ్యుల సంఖ్య 25 నుంచి 38కి పెరుగుతాయని ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు. దీని దీని ప్రకారం, దాదాపు అన్ని శాసనసభా నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. చాలా నియోజకవర్గాలు లక్షా పాతిక వేల ఓట్లకే పరిమితం కావచ్చు. ఇంత తక్కువ ఓట్లతో ఎన్నిక అంటే, పోటీ హోరాహోరీగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. మునిసిపల్, పంచాయతీల స్థాయిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఓటుకు రేటు కూడా వూహించని స్థాయికి పెరిగిపోవడం ఖాయం.
Also Read : ఏపీ లిక్కర్ కేసు.. తెలంగాణాలో భారీ ఆస్తులు..!
అయితే ఈ పునర్విభజన, రాజకీయ పార్టీల మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న. చివరగా 2009లో నియోజకవర్గాల పునర్ విభజన జరిగింది. అప్పుడు ఏపీలో నియోజకవర్గాల సంఖ్యలో కోత పడింది. కానీ.. ఏపీలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు, రిజర్వేషన్ విధానం అంతా కూడా నాటి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా.. ఇంకా చెప్పాలంటే.. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నట్లుగానే జరిగింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఇద్దరూ కలిసి, తమకు అత్యంత ఆప్తులైన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, గాదె వెంకటరెడ్డిలను ముందు పెట్టి, తమకు నచ్చిన రీతిలో గీతలు గీశారు. ఆ కమిటీలో తెలుగుదేశం సభ్యులు కూడా ఉన్నప్పటికీ వారి మాట చలామణి కాలేదు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపునకు ఈ పునర్విభజన బాగా ఉపకరించిందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.
తమకు అనుకూలమైన మండలాలను ఒకేచోట చేర్చడం, వ్యతిరేకం అనుకొన్న వాటిని చీల్చి, ముక్కలు చేసి, ఎక్కడెక్కడో కలపడం వంటి ప్రయోగాలన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉదాహరణకు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం.. 2004 వరకు బాపట్ల జనరల్ నియోజకవర్గం. బాపట్ల పార్లమెంట్ పరిధిలో బాపట్ల, పొన్నూరు, కూచినపూడి, అద్దంకి, మార్టూరు, పర్చూరు, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అక్కడ టీడీపీ అభ్యర్థి వరుసగా గెలుస్తున్నారనే కారణంగా.. దానిని రిజర్వ్ జాబితాలో చేర్చారు. టీడీపీ ఓటింగ్ ఎక్కువగా ఉన్న పొన్నూరును మార్చేశారు. మార్టూరు, కూచినపూడి నియోజకవర్గాలు రద్దు చేశారు. రిజర్వుడు నియోజకవర్గం.. పైగా ఒంగోలుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గాన్ని ఏకంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాపట్లలో కలిపేశారు. ఇలాంటివి ఇష్టం వచ్చినట్లు చేయటం వల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది.
ఇప్పుడా ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. పైన, క్రింద కూడా వారిదే అధికారం కావడం మరో అదనపు అనుకూలత. ఈ పరిణామాలు వైసీపీని కలవరపెడుతున్నాయి. శాసనసభలో పట్టుమని పది మంది కూడా సభ్యులు కూడా లేరు. పైగా ఉన్న వాళ్లు కూడా సభకు రావడం లేదు కాబట్టి, వైసీపీకి కమిటీలో ప్రాతినిధ్యం లభించటం కష్టమే. కేవలం కూటమి సభ్యులు మాత్రమే లోపల ఉంటే, ఇక నియోజకవర్గాల పునర్ విభజన వారి ఇష్టం ప్రకారం ఉండటం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే జరిగితేే.. తమ పార్టీకి నష్టం జరుగుతుందన్నది వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భయం. మహిళలకు మూడో వంతు స్థానాలు కూడా మరో సమస్య. వాటిలో పోటీ చేసే అభ్యర్ధులను వెతికి పట్టడం ఒక ప్రయాస అయితే, వారికి పెట్టుబడి పెట్టడం మరింత కష్టం.
Also Read : ఆర్సీబీ, ఆర్ఆర్ అమ్మకంతో.. బీసీసీఐ ఖజానాలోకి రూ. 1500 కోట్లు..!
ప్రస్తుతం ఎన్నికలు బాగా ఖరీదు. మొన్నటి ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓటుకు రూ.3 వేలు కూడా పంచారు. ఈసారి ఎమ్మెల్యే ఎన్నికకు కనీసం రూ.50 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. 263 సీట్లు అంటే, దాదాపు 13 వేల కోట్ల రూపాయలు కావాలి. కొన్నిచోట్ల అభ్యర్ధులే భరిస్తారనుకున్నా.. రూ.10 వేల కోట్లు తప్పనిసరి. అంత సొమ్ము సమీకరించడం ఒక సమస్యగా భయపెడుతుంటే, నియోజకవర్గాల సరిహద్దులు అధికార పార్టీకి అనుకూలంగా మారిపోవడం మరింత భయాన్ని కలిగిస్తుంది. జగన్ పార్టీకి రెడ్ల పార్టీ అనే ముద్రపడడం ఒక సమస్య. రెడ్లు ఆ పార్టీకే అధికంగా ఓటు వేస్తారనే అభిప్రాయం ఉంది. కాబట్టి, రెడ్ల జనాభా అధికంగా వున్న గ్రామాలను, మండలాలను చిందర వందర చేస్తారని వైసీపీ నేతలు భయపడుతున్నారు. దాని వల్ల వైసీపీ విజయావకాశాలు దారుణంగా ప్రభావితం అవుతాయి. ఈ సమస్యను ఎదుర్కోవడం ఎట్లా అనే ఆందోళన వైసీపీ నేతలందరిలో కనిపిస్తుంది. మరోసారి ప్రతిపక్షంలో కూర్చోవలసి వస్తుందేమో అనే భయం నేతలకు నిద్రలేకుండా చేస్తుదనే మాట మాత్రం వాస్తవం.

