పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. హార్ముజ్ జలసంధి సమీపంలో ఉద్రిక్తతలు పెరగడంతో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా తయారీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం కారణంగా ఇప్పటికే గ్యాస్, ఇంధన కొరత అనే పుకార్లు షికారు చేస్తున్నాయి. భారత్‌కు ఎల్‌పీజీ నౌకలు చేరుతున్నప్పటికీ.. గ్యాస్ కొరత అనే ప్రచారంతో ప్రజలు భయపడిపోతున్నారు. దీంతో గ్యాస్ సిలెండర్ల సరఫరాపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
Also Read : మెగా ఫ్యామిలీపై అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్..!
గృహ వినియోగ గ్యాస్ సరఫరపై ఎలాంటి ఆంక్షలు లేనప్పటికీ.. కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై మాత్రం కేంద్రం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌కు ఇప్పుడు బ్లాక్ మార్కెట్‌లో బాగా డిమాండ్ ఉంది. ధరకు వేలకు చేరడంతో.. చిన్న చిన్న హోటళ్లు ఖర్చు భరించలేక మూత పడుతున్నాయి. కొన్ని హోటళ్లు మాత్రం కర్రల సాయంతో నెట్టుకొస్తున్నాయి. అయితే తాజాగా గ్యాస్ కష్టాలు తిరుమలను తాకింది. తిరుమల కొండపై ఉన్న హోటళ్లు ఇప్పుడు గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో చిన్న చిన్న హోటళ్లు మూత పడుతున్నాయి కూడా.
హోటళ్లు అందుబాటులో లేకపోవడంతో.. భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్నా అన్న ప్రసాదాల పైన ఎక్కువగా ఆధారపడుతున్నారు. సాధారణంగా తిరుమల చేరుకునే భక్తులు ఉదయం అల్పాహరం బయటే తీసుకుంటారు. ఒక్క పూట మాత్రమే శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో భోజనం చేస్తారు. సాయంత్రం చాలా మంది బయటే టిఫిన్‌లతో సరిపెట్టుకుంటారు. ఇందుకు తగినట్లుగానే టీటీడీ కూడా భోజన ఏర్పాట్లు చేస్తుంది. నిత్యం సుమారు 30 వేల మంది వరకు అన్న ప్రసాదం తీసుకుంటారు. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య భారీగా పెరిగినట్లు టీటీడీ అధికారులు వెల్లడిస్తున్నారు.
Also Read : సీట్ల పెంపు.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?
పశ్చిమ ఆసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో తిరుమలకు వచ్చే గ్యాస్ సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో హోటళ్లు చాలా వరకు మూతపడుతున్నాయి. కొండపైన ఇప్పటికే సుమారు 50కి పైగా హోటళ్లు మూత పడినట్లు హోటల్ వ్యాపారస్తులు వెల్లడించారు. చాలా హోటల్స్ పదార్థాల తయారీపై ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని హోటళ్లు ధరలు పెంచేశాయి. ఎక్కువ సమయం ఉడికే ఆహారాలు వండటం మానేశాయి. కొందరు మాత్రం కట్టెల పొయ్యి సాయంతో లాగించేస్తున్నారు. దీంతో గతంలో ఒక్క పూట మాత్రమే అన్న ప్రసాదం స్వీకరించే భక్తులు.. ఇప్పుడు రెండో పూట కూడా అన్నప్రసాద భవనంపైనే ఆధారపడుతున్నారు.
ఫిబ్రవరి నెలలో 7 నుంచి 23వ తేదీ వరకు 17 రోజుల్లో 12.80 లక్షల మంది అన్నప్రసాదాలు స్వీకరించగా.. మార్చి 7 నుంచి 23వ తేదీ మధ్యకాలంలో అదనంగా లక్ష మంది ప్రసాదం స్వీకరించినట్లు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. మార్చి నెలలో 17 రోజుల్లో 13.80 లక్షల మంది అన్న ప్రసాదం తిన్నారు. అలాగే వివిధ ఫుడ్ కౌంటర్లు, క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లు, యాత్రికుల వసతి సముదాయాల్లో అందించే అన్న ప్రసాదం దగ్గర భక్తుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం టీటీడీకి ప్రతి రోజు ఆరు టన్నుల గ్యాస్ అవసరం అవుతుంది. టీటీడీ విజ్ఞప్తి మేరకు ఐఓసీఎల్ ఎలాంటి ఆంక్షలు లేకుండా గ్యాస్ అందిస్తోంది. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మరిన్ని హోటళ్లు మూత పడే ప్రమాదం ఉంది. అప్పుడు టీటీడీపై అదనపు భారం తప్పదు.

