ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ ఈనెల 28న తీర్మానం ఏపీ అసెంబ్లీ చేయనుంది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్మానం ప్రతిని కేంద్రానికి పంపనుంది. ఈ ప్రత్యేక అసెంబ్లీ సెషన్ కోసం తాజాగా ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభిస్తుందని.. ఆ తర్వాత రాజధాని మార్పు అసాధ్యమనేది కూటమి నేతల మాట. అదే సమయంలో అమరావతి నిర్మాణానికి ఎలాంటి ఆటంకం ఉండదని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అమరావతి ఆవశ్యకతపై చర్చించిన అనంతరం.. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ చేసిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా సభ ఆమోదం తెలపనుంది.
Also Read : ఘోర ప్రమాదం.. కాలి బూడిదైన బతుకులు..!
ఒక్కరోజు అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చర్చలో జగన్ పాల్గొని.. రాజధాని పట్ల తన చిత్తశుద్ధి ప్రకటించుకోవాలన్నారు. 2014లో అమరావతి నిర్మాణానికి జగన్ జై కొట్టారని.. రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు సరిపోవన్నారని కూడా గుర్తు చేస్తున్నారు. ఇక 2019 ఎన్నికలప్పుడు తన ఇల్లు అమరావతి పరిధిలోనే ఉందని చెప్పిన జగన్.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు ముక్కలాటకు సై అన్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఏపీ రాజధానిపై ఐదేళ్లకో మాట మార్చే జగన్ ఈ నెల 28వ తేదీన అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయిస్తూ అసెంబ్లీలో పెట్టే తీర్మానానికి వస్తాడా? బెంగళూరులో దాక్కొంటాడా?.. అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.
Also Read : బ్రేకింగ్: జగన్ కు పెమ్మసాని డెడ్లీ వార్నింగ్
టీడీపీ నేతలు ప్రశ్నలకు వైసీపీ నేతలు ధీటుగా బదులిస్తున్నారు. అమరావతి చట్టబద్ధతపై మండలిలో తీర్మానం పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. అమరావతి పేరుతో జరిగే అవినీతిని ప్రశ్నిస్తామని చంద్రబాబుకు భయం అన్నారు. అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న దోపిడీకి మాత్రమే వైసీపీ వ్యతిరేకం అన్నారు. రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తామని చంద్రబాబుకు భయం పట్టుకుందని.. అందుకే మండలిలో చర్చ పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని దోపిడీ ఏపీలో మాత్రమే ఉందన్నారు. మండలిలో కూడా అమరావతి చట్టబద్ధతపై చర్చ జరపాలని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

