పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన పిటిషన్‌ను స్పీకర్ డిస్మిస్ చేశారు. అనర్హత పిటిషన్ల విషయంలో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్.. తాజాగా కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు ఊరట కలిగించారు. రెండు పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ ప్రకటించారు. బీఆర్ఎస్, బీజేపీ వేసిన పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ డిస్మిస్ చేశారు. దీంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రేపు విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : ఏపీ పంచాయతీల్లో విప్లవాత్మక మార్పు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు సైలెంట్‌గా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై స్పీకర్ నిర్ణయం తీసుకోవటం లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ పిటిషన్‌పై విచారణ జరిగిన సుప్రీం కోర్టు.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. దీంతో గతంలోనే 8 మంది సభ్యుల అనర్హత పిటిషన్ పై విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్.. తాజాగా కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు కూడా ఊరట కలిగించారు. వారిద్దరు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని.. ఇద్దరి పై వేసిన పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఈ తీర్పుతో ఆరోపణలు ఎదుర్కొన్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్లైంది.
స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడం అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని.. ఇది కేవలం ఒక తీర్పు కాదు.. అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ అని ఆరోపించారు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే.. ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి?.. అని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని.. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. సరైన సమయంలో సమాధానం చెబుతారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
Also Read : ఇరాన్ ఆయిల్ కు “గోల్డ్ లిక్విడ్” అనే బిరుదు ఎందుకు..?
అయితే కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు కాంగ్రెస్, టీడీపీ నేతలు, అభిమానులు ఘాటుగా బదులిస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ బీ ఫామ్‌పై గెలిచిన వారిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా.. వారికి మంత్రిపదవులు ఇచ్చిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. తలసాని శ్రీనివాసయాదవ్, సబితా ఇంద్రారెడ్డి వంటి నేతలు 2014 ఎన్నికల్లో కారు గుర్తు పైన పోటీ చేసి గెలిచారా.. లేక కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు వారిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా.. పదవులు కూడా కట్టబెట్టిన విషయం గుర్తు లేదా అంటూ కేటీఆర్‌కు కౌంటర్ వేస్తున్నారు. ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను బూతులు తిట్టిన విషయం మర్చిపోతే ఎలా గుర్తు చేస్తున్నారు.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మీరు మాట్లాడితే హాస్యస్పదంగా ఉందని.. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు పలు పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు ఎటు పోయింది ఈ సోయి.. ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటూ గుర్తొస్తున్నాయా.. అని కౌంటర్ వేస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ నేతలు బిక్క మొహం వేస్తున్నారు. ఇటు టీడీపీ నేతలు కూడా గట్టిగానే కేటీఆర్‌కు కౌంటర్ ఇస్తున్నారు. అక్కడ జగన్.. ఇక్కడ కేసీఆర్ తీరు ఒకేలా ఉందన్నారు. ఓ నలుగురు ఎమ్మెల్యేలను లాక్కుంటే.. టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని గతంలో సభలో అహంకార వ్యాఖ్యలు చేసిన జగన్.. 11 సీట్లు మాత్రమే గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని.. కేటీఆర్ కూడా గతంలో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నప్పుడు అనర్హత వేటు వేయలేదు కానీ.. ఇప్పుడు మాత్రం వేయాలని కోరటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

