వారం రోజులపాటు ఉద్యోగాలు, వ్యాపార బాధ్యతలతో బిజీగా గడిపిన చాలామందికి వీకెండ్, ముఖ్యంగా ఆదివారం అంటే విశ్రాంతి, ఉల్లాసం, ఇష్టమైన భోజనం గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలో చికెన్, మటన్, ఫిష్ వంటి మాంసాహారాలతో ప్రత్యేక వంటకాలు చేయించుకుని రోజంతా నాన్‌వెజ్‌తో భోజనం చేయాలనే ఆలోచన సాధారణంగా ఉంటుంది. అయితే రాత్రి వేళ మాంసాహారం తీసుకుని వెంటనే మొబైల్ చూస్తూ లేదా టీవీ చూస్తూ నిద్రలోకి జారుకోవడం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : పాక్ వక్రబుద్ధి.. ఐసీసీ షాక్ తప్పదా..?
మాంసాహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, అందులోని కొవ్వు (ఫ్యాట్) మరియు సంక్లిష్ట పోషకాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. సాధారణ ఆహారం రెండు నుంచి మూడు గంటల్లో జీర్ణం అయితే, చికెన్ లేదా మటన్ వంటి మాంసాహారం జీర్ణం కావడానికి నాలుగు నుంచి ఆరు గంటల వరకు పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో తిన్న వెంటనే నిద్రపోతే కడుపులో ఆమ్లం పైకి రావడం (యాసిడ్ రిఫ్లక్స్), ఛాతీలో మంట, గొంతులో చేదు రుచి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవి తరచుగా కొనసాగితే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే రాత్రి మాంసాహారం తీసుకున్న తర్వాత వెంటనే నిద్రపోకుండా కనీసం మూడు గంటల విరామం ఇవ్వడం మంచిది. ఉదాహరణకు రాత్రి 11 గంటలకు నిద్రపోవాలనుకుంటే, రాత్రి 8 గంటలకే భోజనం పూర్తి చేయాలి. భోజనం చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు నెమ్మదిగా నడవడం జీర్ణక్రియకు సహకరిస్తుంది. కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగడం లేదా అల్లం, పుదీనా టీ తీసుకోవడం వల్ల అజీర్తి, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అలాగే తిన్న వెంటనే మొబైల్, టీవీ చూసే అలవాటు తగ్గించడం కూడా అవసరం.
Also Read : నకిలీ వివిఐపి పాసులు.. వెనకున్నది టిడిపి వారేనా..?
ఆదివారం నాడు నాన్‌వెజ్ తినడంలో తప్పేమీ లేదు. అయితే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయం, సరైన పద్ధతులు పాటిస్తే జీర్ణ సమస్యలు, నిద్ర భంగం వంటి సమస్యలు దూరంగా ఉంటాయి. చిన్నచిన్న జాగ్రత్తలు, ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా దీర్ఘకాలంలో శరీరాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

