తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కుంభకోణం ఇప్పుడు కలకలం రేపుతోంది. అయితే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఎలా బయటకు వచ్చిందనేది ఇప్పుడు చిదంబర రహస్యంగా మారింది. నిజానికి కల్తీ నెయ్యి వినియోగం అనేందుకు ప్రస్తుతం ఎలాంటి రుజువులు లేవు. కేవలం గత రికార్డు ఆధారంగానే ఈ కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎలా వచ్చింది..? లడ్డూ తయారీ కోసం కల్తీ నెయ్యి వినియోగించారనే విషయం ఎలా వెలుగులోకి వచ్చింది..?
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. నిత్యం గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మారుమోగుతుంటాయి. స్వామి వారిని నిత్యం లక్ష మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఆనంద నిలయంలోని శ్రీవారి సన్నిధిలో ఎలాంటి విద్యుత్ దీపాలు ఉండవు. కేవలం దీపం వెలుగులోనే శ్రీనివాసుని దివ్య మంగళ రూపం భక్తులకు దర్శనం ఇస్తుంది. శ్రీనివాసుని సన్నిధిలో ఒక దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఉదయం సుప్రభాత సేవ మొదలు.. రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీనివాసునికి రకరకాల దీపాలతో, హారతులు ఇస్తుంటారు. అయితే శ్రీవారి సన్నిధిలో ఒక దీపం మాత్రం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఆ దీపం నూనెతో కాకుండా కేవలం నెయ్యితోనే వెలిగిస్తారు. ఇక్కడే అసలు విషయం బయటపడింది.
Also Read : చెవిరెడ్డికి బెయిల్.. ఆయన్ను మాత్రం వదలని హైకోర్ట్..!
స్వామి వారి దివ్య మంగల స్వరూపానికి పూనుగు పిల్లి తైలంతో మర్థనా చేస్తారు. అలాగే నిత్యం వెలిగే దీపంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వినియోగిస్తారు. ఆ దీపం నుంచి వచ్చే సువాసన కూడా మధురంగా ఉంటుంది. కానీ ఆ దీపంలో కల్తీ నెయ్యి వాడటంతో.. ఒక విధమైన వాసన రావడంతో.. శ్రీవారి సన్నిధిలోని అర్చకులు, పూజారులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వెంటనే ఆ నెయ్యి మార్చేసి గోశాల నుంచి తెప్పించిన నెయ్యి వాడటంతో వాసన మారినట్లు గుర్తించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. అంతకు ముందు వాడిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు గుర్తించారు. అయితే ఈ విషయాన్ని అధికారులు, అర్చకులు గుట్టుగా ఉంచారు. దీంతో ఈ విషయం అప్పట్లో బయటకు రాలేదు.
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిజానికి లడ్డూల నాణ్యత పై చాలా ఫిర్యాదులు వచ్చాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో లడ్డూలు, అన్న ప్రసాదం పై భక్తులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కానీ వాటిని టీటీడీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవోగా శ్యామల రావును నియమించారు చంద్రబాబు. ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు.. లడ్డూ తయారీ పోటును ఆకస్మికంగా తనిఖీ చేశారు. లడ్డూల నాణ్యతపై పనిచేసే సిబ్బందిని నిలదీయటంతో.. నిజాలు చెబితే.. తమ ప్రాణాలకు ముప్పు వస్తుందనే భయంతో కల్తీ నెయ్యి గురించి బయటపెట్టలేదు. కానీ అదే సమయంలో నెయ్యి మార్పు చేస్తే.. అప్పుడు మేము తయారు చేసిన లడ్డూలు రుచి చూసి చెప్పండి. అని నర్మగర్భంగా కల్తీ గురించి చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read : మేడం చుట్టూ విమర్శలు.. ఆ వెంటనే..!
దీంతో రంగంలోకి దిగిన శ్యామలరావు.. తిరుపతి నుంచి తెప్పించిన నెయ్యితో తయారు చేసిన లడ్డూలు నాణ్యతతో రుచిగా ఉండటంతో.. కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడింది. దీంతో ఆఘమేఘాల మీద ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విషయం తెలియజేయడంతో.. కల్తీ నెయ్యి బాగోతం బయటపడింది. అయితే కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడమే కొత్త వివాదం. వైసీపీ నేతలు కల్తీ నెయ్యి విషయం వదిలేసి.. జంతువుల కొవ్వు అనే వ్యాఖ్యలనే హైలైట్ చేస్తున్నారు. అసలు జంతువుల కొవ్వు వాడారనే మాటను చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఎవరి చెప్పారనేది తెలియాల్సి ఉంది.
నెయ్యిలో కల్తీ జరిగింది నిజం.. జంతువుల కొవ్వు కలవలేదని సిట్ అధికారులు జరిపిన విచారణలో తెలింది. అయితే కల్తీ జరిగింది నిజం. ఆ కల్తీ కూడా వైసీపీ ప్రభుత్వ హయాం లోనే.. అప్పుడు టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో గా అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల అదనపు ఈవో గా ధర్మారెడ్డి, సింఘాల్ తరువాత జవహర్ రెడ్డి, ఆయన తరువాత టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవోగా ధర్మారెడ్డి పని చేశారు. కల్తీ నెయ్యి విషయం ఎవరెవరికి తెలుసనే విషయం పై సిట్ అధికారులు లోతుగా విచారణ జరిపినా.. లడ్డూ తయారు చేసే చోట పని చేసే వారిని విచారించినా అసలు దొంగలు బయట పడతారు. కానీ సిట్ అధికారులు దాని జోలికి పోలేదు. సీఎం చంద్రబాబు కూడా ఆ విషయం పై దృష్టి పెట్టటం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోవటం లేదు. దీనితో కొసరు నిందితులు దొరికారు.. అసలు దొంగల గుట్టు బయట పడలేదన్నది వాస్తవం.

