Wednesday, February 4, 2026 10:48 AM
Wednesday, February 4, 2026 10:48 AM

పార్టీలో అందరి తాట తీస్తానంటున్న విజయ్..!

“గీత దాటితే తాట తీస్తా.. రాజకీయాల్లో వ్యక్తిత్వం ముఖ్యం.. అది లేని రోజున ఎందుకు ఈ బతుకులు.. చేతకాకపోతే ఇంట్లో చీర కట్టుకుని కూర్చోండి.. అంతే కానీ… పార్టీకి ద్రోహం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు..” తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ చేసిన వ్యాఖ్యలివి. పార్టీలో కొందరు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విజయ్.. చివరికి సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకే వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు నర్సీపట్నం నియోజకవర్గ స్థాయి సమావేశంలో చేసినప్పటికీ.. పార్టీ ప్రధాన కార్యదర్శి కావడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ క్యాడర్‌కు కూడా సూటిగా తగులుతున్నాయి. విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయా వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం నియోజవర్గంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చింతకాయల విజయ్.. సొంత పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో పార్టీలో కొందరు వ్యవహరిస్తున్న తీరును స్పష్టంగా ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా వైసీపీ నేతలతో అంటకాగుతున్న వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు విజయ్. ఎవరైతే లోపాయికారి సంబంధాలు కొనసాగిస్తున్నారో.. వారి తాట తీస్తా అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Also Read : కారు ప్రియులకు కేంద్రం గుడ్ న్యూస్..!

నిజానికి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. రాజకీయంగా వేరు వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ.. చాలా మంది కలిసే వ్యాపారాలు చేస్తున్నారు కూడా. అయితే 2012లో వైసీపీ ప్రారంభమైన తర్వాత పరిస్థితి మారిపోయింది. మరీ ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అయితే.. ఈ పరిస్థితి మరీ దిగజారి పోయింది. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలను ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేయడం సర్వ సాధారణం. అయితే వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు మాత్రం కేవలం వ్యక్తిత్వ హననం, కక్ష రాజకీయం మాత్రమే చేశారు ఆ పార్టీ నేతలు. కింది స్థాయి కార్యకర్తలు మొదలు.. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వరకు ఇబ్బందులకు గురయ్యారు. చంద్రబాబు కుటుంబంపైన నీచమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ముఖ్య నేతలపై కేసులు పెట్టి వేధించారు. దాడులకు తెగబడ్డారు. దీని వల్ల ఆర్థిక నష్టంతో పాటు మానసిక వేధనకు గురయ్యారు తెలుగు తమ్ముళ్లు.

అందుకే ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పని చేసి టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు కఠిన పోరాటం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులకు గురైన వారిలో చింతకాయల అయ్యన్నపాత్రుడు అగ్రస్థానంలో ఉన్నారు. స్థలం కబ్జా చేశారంటూ ఇల్లు కూల్చేశారు. అక్రమ కేసులు పెట్టి వేధించారు. అయ్యన్నను టార్గెట్ చేసి వేధించారు. చివరికి తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని స్వయంగా అయ్యన్న పాత్రుడు ఆందోళన వ్యక్తం చేశారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ తట్టుకుని నిలబడిన చింతకాయల కుటుంబం.. 2024 ఎన్నికల్లో నర్సీపట్నంలో 54 శాతం ఓట్లు సాధించి 24 వేల పై చిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం శాసనసభాపతిగా ఉన్నారు అయ్యన్నపాత్రుడు.

Also Read : తర్వాతి కెప్టెన్ అతనే.. షైన్ అవుతున్న శర్మ..!

అన్ని ఇబ్బందులు పెట్టిన వైసీపీ నేతలతో కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబందాలు కొనసాగిస్తున్నారనే విషయం ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. అందుకే ఆ పార్టీ నేతలు మళ్లీ రెచ్చిపోతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిజానికి విజయ్ చేసింది నర్సీపట్నంలోననే అయినా.. అవి పార్టీలోని అందరినీ ఉద్దేశించి అన్నట్లుగా చర్చ నడుస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామ పోయినా పర్లేదు.. కానీ నమ్మక ద్రోహం మాత్రం సహించేది లేదు అంటూ విజయ్ హెచ్చరిచ్చారు.

‘సిగ్గు, లజ్జ లేకుండా వైసీపీ వాళ్లతో తిరిగే వారి వివరాలు సేకరిస్తున్నాను.. పార్టీకి విరుద్ధంగా ప్రవర్తిస్తే ‘పేగులు తీసి రోడ్డు మీద పడేస్తా’ అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు.. కొందరు టీడీపీ నేతలు ఇప్పటికీ వైసీపీ నేతలతో అంటకాగుతున్న విషయాన్ని బయటపెట్టినట్లు అయ్యింది. తాను కూడా టికెట్ ఆశించిన విషయాన్ని గుర్తు చేసిన విజయ్.. టికెట్ రాలేదు.. అంత మాత్రానా పార్టీకి దూరమయ్యానా.. అని ప్రశ్నించారు. ‘నేను చచ్చేవరకు పార్టీలోనే ఉంటాను.. పార్టీకి ద్రోహం చేయాలని చూస్తే ఊరుకోను’ అని పార్టీ పట్ల తన నిబద్ధతను స్పష్టం చేశారు విజయ్. వైసీపీ నాయ‌కుల‌తో మాట్లాడినా,శుభ కార్యాలకు వెళ్లినా ఊరుకునేది లేద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగించే వారిపై విజయ్ కఠినమైన పదజాలం వాడారు.

Also Read : పద్మ పురస్కారాల లక్ష్యం అదేనా..!

నిజానికి ఇతర పార్టీ నేతలతో మాట్లాడటం, వారి శుభకార్యాలయం హాజరవ్వటం పెద్ద తప్పేమీ కాదు. గతంలో చంద్రబాబు, వైఎస్ఆర్ కలిసి ఎన్నో వేడుకల్లో పాల్గొన్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ దగ్గరకు సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి పలకరించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. రేవంత్ నేరుగా వెళ్లి పరామర్శించారు కూడా. రాజకీయ వైరం వేరు, వ్యక్తిగత వైరం వేరు. కానీ ఏపీలో వైసీపీ నేతలు రాజకీయ వైరాన్ని వ్యక్తిగత వైరంగా మార్చేశారు. అధికారం కోసం వ్యక్తిగత దూషణలు, నీచమైన ఆరోపణలు, రాయలేని భాషలో మాటలతో రెచ్చిపోయారు. అందుకే ఇప్పుడు టీడీపీ, వైసీపీ మధ్య కనీస పలకరింపులు కూడా లేవు. ఇలాంటి సమయంలో కొందరు నేతలు పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే చింతకాయల విజయ్ ఈ తరహా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చింతకాయల విజయ్ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్