విశాఖపట్నం నుంచి బయలుదేరే కీలక రైళ్లపైన ఒడిశా కన్ను పడిందా.. అంటే అవుననే మాట బాగా వినిపిస్తోంది. విశాఖ సహా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రారంభించిన కీలక రైళ్లను ఒడిశా నెమ్మదిగా లాగేసుకుంటోంది. ఇప్పటి వరకు విశాఖపట్నం జంక్షన్ ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉంది. దువ్వాడ నుంచి దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రారంభం అవుతుంది. ఇలా ఉండటమే తూర్పు కోస్తా రైల్వే అధికారులకు కలిసి వచ్చింది. ఏపీ వాసుల కోసం రైలు ప్రారంభించాలని చూస్తే.. వెంటనే రంగంలోకి దిగే తూర్పు కోస్తా రైల్వే అధికారులు.. విశాఖ నుంచి అయితే కష్ఠం అంటూ కొర్రీలు పెడుతున్నారు.
విశాఖ నుంచి ప్రారంభించడానికి కష్టమనే రైల్వే అధికారులు.. అదే రైలు ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి ప్రారంభించడానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. నిజానికి ఇలాంటి వైఖరిని తొలి నుంచి చూపిస్తున్నారు ఒడిశా అధికారులు. విశాఖ నుంచి పుట్టపర్తి మీదుగా బెంగళూరు వరకు ప్రారంభించిన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలును సైలెంట్‌గా భువనేశ్వర్ వరకు పొడిగించారు. అలాగే సికింద్రాబాద్ నుంచి గుంటూరు, భీమవరం మీదుగా విశాఖపట్నం వరకు నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా భువనేశ్వర్ వరకు పొడిగించారు. అలాగే విశాఖ – తిరుపతి మధ్య నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు పొడిగింపు కోసం కూడా తూర్పు కోస్తా రైల్వే అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. ముందు శ్రీకాకుళం, పలాస వరకు పొడిగించాలని ప్రతిపాదనలు పంపారు. అయితే విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో.. సైలెంట్ అయ్యారు.
Also Read : చెల్లెమ్మను ఎలా దారిలో పెట్టాలి..?
తాజాగా భువనేశ్వర్ కేంద్రంగా నడుస్తున్న తూర్పు కోస్తా రైల్వే జోన్ అధికారులు రైల్వే శాఖకు మరో కీలక ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. నిజానికి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీంతో ఇప్పటి వరకు తమ పరిధిలో ఉన్న రైళ్లను భువనేశ్వర్ వరకు పొడిగించాలని తూర్పు కోస్తా రైల్వే అధికారులు లేఖ రాశారు. ప్రస్తుతం విశాఖ నుంచి ప్రతిరోజు సికింద్రాబాద్ వరకు గోదావరి, గరీబ్ రథ్ సూపర్ ఫాస్టట్ రైళ్లు నడుస్తున్నాయి. గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు 1974 ఫిబ్రవరి ఒకటి నుంచి విశాఖ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సేవలందిస్తోంది. గోదావరి ఎక్స్‌ప్రెస్ భారత దక్షిణ మధ్య రైల్వేలోనే ఒక ప్రతిష్ఠాత్మక రైలు సర్వీసు. ఈ మార్గంలో ఎన్ని కొత్త రైళ్లు ప్రవేశపెట్టినప్పటికీ, గోదావరి రైలుకి ఇప్పటికి భారీ రద్దీ ఉంది. సెమీ హైస్పీడ్ రైలుతో సమానంగా గంటకు 125 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కూడా.
తొలి నుంచి గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలును భువనేశ్వర్ వరకు పొడిగించాలనే ప్రతిపాదనలను ఒడిశా ప్రభుత్వం, ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు చేస్తూనే ఉన్నారు. కానీ.. విశాఖ ప్రజలు, రాజకీయ నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంత ఈ ప్రతిపాదనను రైల్వే శాఖ అధికారులు తిరస్కరించారు. ఆ తర్వాత నుంచి విశాఖ నుంచి ప్రారంభించాలని చూసిన అన్ని రైళ్లను నెమ్మదిగా భువనేశ్వర్ వరకు పొడిగిస్తూనే ఉన్నారు తూర్పు కోస్తా రైల్వే అధికారులు. కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో.. తమ రైళ్లను తమకే కేటాయించాలనే వింత వాదనను తెరపైకి తీసుకువచ్చారు.
Also Read :ఏపీలో అసలేం జరుగుతోంది..?
అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ – సికింద్రాబాద్ గరీబ్‌రథ్‌పై తూర్పు కోస్తా రైల్వే అధికారులు దృష్టి సారించారు. ఇవి విశాఖ వాసులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు తుది దశకు చేరుకున్న కీలక సమయంలోనే ఈ ప్రయత్నాలు చేస్తోంది. విశాఖ నుంచి ప్రారంభమయ్యే అన్ని రైళ్లు కూడా ఫుల్ ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయి. ఆఫ్ సీజన్, ఆన్ సీజన్‌తో సంబంధం లేకుండా గోదావరి, గరీబ్ రథ్, జన్మభూమి, వందేభారత్ రైళ్లు నిత్యం రద్దీగానే ఉంటాయి. కానీ.. తూర్పు కోస్తా రైల్వే అధికారులు మాత్రం.. అంతగా రద్దీ లేదని తప్పుడు నివేదికలతో ఒక్కొక్క రైలును నెమ్మదిగా పొడిగిస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి సాకుతో ఇప్పటికే చాలా రైళ్లను దువ్వాడ నుంచి బైపాస్ చేస్తున్నారు. దీని వల్ల విశాఖ వాసులు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని దువ్వాడ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుంది.
రద్దీ లేదు అనే సాకుతోనే ఇప్పటికే ప్రశాంతి, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పొడిగించిన ఈస్ట్ కోస్ట్ అధికారులు.. గోదావరి, గరీబ్ రథ్ విషయంలో కూడా ఇదే మాదిరిగా తప్పుడు నివేదికలు పంపినట్లు తెలుస్తోంది. గోదావరి రైలులో రాజమండ్రి నుంచే ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారని.. విశాఖ నుంచి 60 నుంచి 70 శాతం ఆక్సుపెన్సీతోనే నడుస్తుందని నివేదిక పంపినట్లు సమాచారం. ఇదే ఇప్పుడు విశాఖ రైల్వే వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి 51 ఏళ్లుగా విశాఖ వాసులకు సేవలందిస్తున్న రైలు గోదావరి. ఈ రైలు కొన్ని సందర్భాల్లో 150 శాతం ఓవర్ లోడ్‌తో కూడా ట్రావెల్ చేస్తుంది. నిజానికి ఎన్ని కొత్త రైళ్లు వచ్చినా సరే.. గోదావరి డిమాండ్ మాత్రం తగ్గలేదు. విశాఖ – హైదరాబాద్ మధ్య పరుగులు పెట్టే గోదావరి సూపర్ ఫాస్ట్ రైలుతో చాలా మందికి ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే విశాఖ ప్రజలకు ఈ రైలు కేవలం రవాణా సాధనం మాత్రమే కాదు.. భావోద్వేగ అనుబంధం కూడా.
Also Read :ఆ సీనియర్లకు పదవీ యోగం లేదా..?
గతంలో భువనేశ్వర్ పొడిగింపు ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న రైల్వే అధికారులు.. ఇప్పుడు మాత్రం ప్రాంతీయ భావన సాకు చూపిస్తున్నారు. కొత్తగా విజయనగరం, గుణుపూర్ వరకు పొడిగించాలనే ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను గుణుపూర్ నుంచి విశాఖ మీదుగా హైదరాబాద్ నడపాలంటూ చేసిన ప్రతిపాదనలు కలకలం రేపుతోంది. ఈ అంశంపై కేంద్ర మంత్రులు, రైల్వే మంత్రిని కలిసి వినతిపత్రాలు అందించినట్లు సమాచారం.
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు పదేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. వాల్తేరు డివిజన్‌ను నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ముడసర్లోవలో జోన్ ప్రధాన కార్యాలయానికి భూమి పూజ జరిగిన వేళ.. గోదావరి లేదా గరీబ్‌రథ్‌ను తరలిస్తే అది విశాఖ ప్రజలపై మరో భారీ దెబ్బగా మారుతుందని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. గోదావరి ఇవ్వకపోతే గరీబ్‌రథ్ అయినా కావాలంటూ ఒత్తిడి తెస్తున్నారని వాల్తేరు డివిజన్‌కు చెందిన కొందరు అధికారులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీలు, రాష్ట్ర ప్రజాప్రతినిధులు తక్షణమే జోక్యం చేసుకోకపోతే.. విశాఖ నుంచి మరో కీలక రైలు చేజారిపోయే ప్రమాదం ఉందన్న భయం రోజురోజుకీ పెరుగుతోంది.

