ఏపీ బీజేపీలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. పేరుకే కూటమిలో ఉన్నప్పటికీ కనీసం ఒక్కసారి కూడా ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి పాలనపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటే.. తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు ఘాటుగా బదులిస్తున్నారు. పైగా వైసీపీ అధికారంలో ఐదేళ్ల పాటు జరిగిన తప్పులను కూడా టీడీపీ, జనసేన నేతలు ఎత్తి చూపిస్తున్నారు. కానీ.. కూటమిలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు మాత్రం కనీసం స్పందించటం లేదు. చివరికి సొంత పార్టీ నేతకు సంబంధించిన వ్యవహారం అయినా సరే.. కమలం పార్టీ నేతలు మాత్రం.. నాకెందుకు వచ్చింది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తప్ప.. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కనీసం కౌంటర్ కూడా ఇవ్వటం లేదు. తాజాగా ఏపీలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు ఉదాహరణ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read : అమెరికన్ల ఉద్యోగాలపై జేడి వాన్స్ సంచలనం..!
ఏపీ బీజేపీలో తొలి నుంచి రెండు వర్గాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఒకటి చంద్రబాబు అనుకూల వర్గం అయితే.. మరో వర్గానికి వైఎస్ జగన్ అనుకూలం అనే ముద్ర ఉంది. వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు.. జగన్ పాలనపై కనీసం పల్లెత్తు మాట కూడా అనని సదరు నేతలు.. గత ఐదేళ్ల చంద్రబాబు పాలన అంటూ విమర్శలు చేశారు. అందులో నాలుగేళ్ల పాటు బీజేపీ కూడా పొత్తులో భాగంగా మంత్రివర్గంలో ఉందనే విషయాన్ని మర్చిపోయారు. ఏ విషయం అయినా సరే.. జగన్ పై ఈగ వాలకుండా జాగ్రత్త పడిన కొందరు కాషాయ పార్టీ నేతలు.. చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో పొత్తు గురించి కూడా సదరు నేతలు ఘాటు వ్యాఖ్యలే చేశారు. నిజానికి పొత్తు అంశం ఢిల్లీ పెద్దల పరిధిలో అంశం అయినప్పటికీ.. అంతా తమ కంట్రోల్‌లోనే ఉందన్నట్లుగా మాట్లాడారు. అసలు చంద్రబాబుతో చేతులు కలిపేది లేదని తేల్చేశారు కూడా. అయితే కూటమి పొత్తు తర్వాత సదరు నేతలకు పెద్దగా పని లేకుండా పోయింది.
కూటమి సర్కార్ ఏర్పాటు తర్వాత పదవులు వస్తాయని వైసీపీ అభిమాన కాషాయ నేతలు భావించారు. కానీ.. ఏపీలో పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చిన ఢిల్లీ పెద్దలు.. సదలు నేతలను దూరం పెట్టారు. కనీసం పార్టీ పదవులు కూడా దక్కకపోవడంతో.. వీరంతా సైలెంట్ అయ్యారు. వీరితో పాటు బీజేపీ నేతలంతా కూడా మౌనవ్రతం పాటిస్తున్నారనే విమర్శలు కూడా ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కనీసం ఒక్కరు కూడా బీజేపీ నేతలు స్పందించకపోవడమే. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన వైసీపీ నేతలు.. కోటి సంతకాల పేరుతో హడావుడి చేశారు. దీనిపై జగన్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు టీడీపీ, జనసేన నేతలు కౌంటర్ ఇచ్చారు తప్ప.. బీజేపీ తరఫు నుంచి ఒక్కరు కూడా స్పందించ లేదు.
Also Read : మళ్ళీ కలిసిపోయిన నందమూరి ఫ్యాన్స్..?
నిజానికి ఏపీలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతుంది బీజేపీ నేత సత్యకుమార్. కాషాయ పార్టీ పరిధిలో ఉన్న శాఖపైనే జగన్ విమర్శలు చేసినా సరే.. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కనీసం స్పందించలేదు. సత్యకుమార్ మాత్రం దమ్ముంటే అరెస్టు చేసుకో అని సవాల్ విసిరారు. తనతో పాటు మోదీని కూడా అరెస్టు చేయాలన్నారు సత్యకుమార్. అయినా సరే.. ఇతర బీజేపీ నేతలు మాత్రం.. నాకెందుకు వచ్చింది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తప్ప.. కనీసం స్పందించలేదు. దీనిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీనే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన కొందరు బీజేపీ నేతలు.. ఇప్పుడు మాత్రం.. వైసీపీ అధినేత జగన్‌ను ఎందుకు పల్లెత్తు మాట కూడా అనటం లేదని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. దీనిపై రాష్ట్ర, జాతీయ స్థాయి పార్టీ నేతలు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వైసీపీ నేతలపై సత్యకుమార్ మాత్రమే ఒంటరి పోరు చేస్తున్నారని.. మిగిలిన కమలం పార్టీ నేతలంతా ఆయనకు కనీసం మద్దతు ఇవ్వటం లేదని విమర్శిస్తున్నారు కూడా.

