నోరేసుకుని పడిపోతే చాలు.. ఓ జర్నలిస్టు అయిపోతారు.. ఇక ఓ పార్టీకి భజన చేస్తే చాలు.. ఛానల్ పెట్టేస్తారు.. ఈ మాటలు రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గో స్వామికి సరిగ్గా సరిపోతాయి. బీజేపీ అండతో రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్‌లో మేనేజింగ్ డైరెక్టర్, ఎడిటర్ ఇన్ చీఫ్ హోదాలో ఉన్న గో స్వామి.. గతంలో ఎన్‌డీటీవీ, టైమ్స్ నౌ కూడా పని చేశారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ అర్నాబ్ పేరుతో బాగా ఫేమస్ అయ్యారు. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో.. అర్నాబ్ పంట పండినట్లు అయ్యింది. తాను వేసిందే ప్రశ్న.. తాను చెప్పిందే వార్త.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
2 రోజులుగా అర్నాబ్ గో స్వామి తీరు ఎన్నో విమర్శలకు తావిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. ఇండిగో విమానాల ఆలస్యం, రద్దు అంశంపై గో స్వామి నిర్వహించిన డిబేట్. ఈ చర్చలో తెలుగుదేశం పార్టీ తరఫున అధికార ప్రతినిధులు దీపక్ రెడ్డి, పట్టాభి వేరు వేరుగా పాల్గొన్నారు. ఈ ఇద్దరి పట్ల గో స్వామి వ్యవహరించిన తీరు.. ఈ ఇద్దరికి గో స్వామి వేసిన ప్రశ్నలు ఇప్పుడు కూటమిలో విభేదాలకు కూడా కారణమవుతోంది. అసలు అర్నాబ్ ఏం ప్రశ్న వేస్తున్నారో కూడా తెలియకుండా నోరేసుకుని పడిపోతున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
Also read : నిన్న జోగి.. రేపు వల్లభనేని..? మళ్ళీ ముహూర్తం ఖరారు..?
ఇండిగో ఎయిర్ లైన్స్ అనే ఓ ప్రైవేటు సంస్థ తన సర్వీసులను రద్దు చేసింది. దీని వల్ల ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనిపైన ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నాలుగు రోజులుగా అధికారులతో, సంస్థ ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. అదే సమయంలో ఇండిగో సంస్థకు కూడా ప్రయాణీకులకు డబ్బులు తిరిగి చెల్లించాలని డెడ్ లైన్ పెట్టారు. అలాగే టికెట్ ధరలు పెంచితే చూస్తూ ఊరుకునేది లేదని ఇతర ఎయిర్ లైన్ సంస్థలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ప్రయాణీకులు ఇబ్బందులకు గురి కాకుండా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు కూడా. ఇక తాజాగా రాజ్యసభలో కూడా ఇదే విషయంపై రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. ఇండిగో సిబ్బంది రోస్టరింగ్, అంతర్గత ప్రణాళిక వ్యవస్థలో సమస్యల కారణంగా ఈ సంక్షోభం తలెత్తిందని, ఏవియేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ కారణం కాదని స్పష్టం చేశారు.
అయితో గో స్వామి మాత్రం.. డిబేట్‌లో పాల్గొన్న టీడీపీ ప్రతినిధులను పిచ్చి ప్రశ్నలతో సతాయించారు. 4 రోజులుగా రామ్మోహన్ రివ్యూలు చేస్తున్న విషయం మీడియాలో వార్తలుగా వస్తూనే ఉన్నాయి. కానీ గో స్వామి మాత్రం.. మీ మంత్రి ఎక్కడా అంటూ రామ్మోహన్ నాయుడును టీడీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా పోల్చారు. కేంద్రంలో మోదీ సర్కార్ ఉంది.. అందులోనే రామ్మోహన్ భాగమనే విషయాన్ని మర్చిపోయిన గో స్వామి.. అసలు మంత్రి ఎక్కడా అని అడుగుతున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం లేదని.. కేవలం రామ్మోహన్ వైఫల్యం అని ఈష్యూ డైవర్ట్ చేసేలా గొంతేసుకుని పడిపోయారు.
Also read : ముచ్చల్‌తో బ్రేకప్.. చివరికి నిజం చెప్పిన స్మృతి
ఇక మరో అడుగు ముందుకు వేసిన గో స్వామి.. ఇది రామ్మోహన్ వైఫల్యమని.. కాబట్టి రాము వెంటనే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కూడా. అయితే ఇక్కడే అసలు విషయం బయటకు రాకుండా గో స్వామి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ వివాదంలో అదానీ పాత్ర కీలకమనేది విపక్షాలు చేస్తున్న ఆరోపణ. కానీ గో స్వామి మాత్రం.. అదేం తనకు తెలియదన్నట్లుగా నోటితో దాడి చేశారు. విమానాల ఆలస్యం, రద్దుకు బాధ్యత వహిస్తూ రామ్మోహన్ రాజీనామా చేయాల్సిందే అంటూ వింత వాదన తెరపైకి తీసుకువచ్చారు.
గో స్వామికి నెటిజన్లు, టీడీపీ అభిమానులు ఘాటుగా బదులిస్తున్నారు. ప్రైవేటు విమానాల ఆలస్యం, రద్దుకే రాము రాజీనామా అడుగుతున్న గో స్వామి.. ప్రతి రోజు దాదాపు అన్ని రైళ్లు ఆలస్యమవుతున్నాయని.. పదుల సంఖ్యలో రైళ్లు రద్దు అవుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే శాఖ మంత్రి రాజీనామా ఎందుకు అడగలేదని నిలదీస్తున్నారు. ఇక అసోం హింస, పహల్గామ్ ఉగ్ర దాడి, ఢిల్లీ పేలుడు వంటి దాడులు జరిగినప్పుడు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ రాజీనామా ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. మోదీ సర్కార్ తీసుకువచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రోజుల తరబడి ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలు చేసినప్పుడు, దేశ రాజధానిని ముట్టడించినప్పుడు ఎందుకు రాజీనామ డిమాండ్ చేయలేదని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నిలదీస్తున్నారు. యువ మంత్రిపై అర్నాబ్ గో స్వామి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

