దాదాపు రెండు వారాల క్రితం భీమవరం డిఎస్పి జయసూర్య వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. కోడిపందాలను, పేకాటలను, ఇతర జూదాలను ఆయన ప్రోత్సహిస్తున్నారని జనసేన నేతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో అదే దూకుడు ప్రదర్శించి.. వెంటనే డిఎస్పీ వ్యవహారానికి సంబంధించి తనకు నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఇక అక్కడ నుంచి ప్రభుత్వ పెద్దలు, పోలీస్ శాఖ కూడా ఈ అంశంపై ఆరా తీయడం మొదలుపెట్టారు.
Also Read : మావోయిస్టుల వద్ద ఎన్ని కేజీల బంగారం ఉందంటే..?
సీఎం చంద్రబాబు నాయుడు హోం మంత్రి అనితను ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు అడిగారు. ఆలస్యం చేయకుండా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక మరుసటి రోజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు డీఎస్పీ చాలా మంచి అధికారి అని, ఆయన గురించి పవన్ కళ్యాణ్ కు తప్పుడు సమాచారం ఇచ్చారని అభిప్రాయపడ్డారు. ఇక దీని గురించి జిల్లా ఎస్పీ విచారణ జరుపుతున్న సమయంలో, అక్టోబర్ 31న, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ కొన్ని అవార్డులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలో సమర్థవంతంగా వ్యవహరించిన వారికి ప్రతిష్టాత్మక అవార్డులు ఇస్తూ ఉంటుంది.
Also Read : టీడీపీ మహిళా ఎమ్మెల్యే సంచలనం.. చంద్రబాబును కూడా లెక్క చేయడం లేదా..?
అప్పట్లో సంచలనమైన ఓ కేసును అద్భుతంగా ఛేదించినందుకుగాను డిఎస్పీకి కేంద్ర హోం శాఖ అవార్డు ఇచ్చింది. దీనితో ఈ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. రఘురామ చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ కు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభిప్రాయాలు బలపడ్డాయి. దీనిపై పవన్ కళ్యాణ్ తొందరపడ్డారని, నిజా నిజాలు తెలుసుకోకుండా ఆదేశాలు ఇచ్చేసారని, ఇక జనసేన నేతలు కూడా సోషల్ మీడియాలో హడావిడి చేశారని విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఏదైనా చర్యలు తీసుకుంటే అది చెడు సంకేతాలను పంపించే అవకాశం సైతం ఉంటుంది. దీంతో ఈ డిఎస్పి వ్యవహారం లో ప్రభుత్వాన్ని కేంద్ర హోమ్ శాఖ ఓ రకంగా ఆత్మ రక్షణలో పడేసినట్లయింది. మరి దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా అనేది కూడా ఆసక్తిగా మారింది.

